నిషేధిత గుబులు! | - | Sakshi
Sakshi News home page

నిషేధిత గుబులు!

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

● 22ఏ జాబితాలో పట్టా భూములు ● జిల్లాలో రిజిస్ట్రేషన్లకు ఆటంకం ● ఆందోళన చెందుతున్న యజమానులు

చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్‌లో 1,123 మంది రైతులకు చెందిన సుమారు మూడు వేల ఎకరాలకు పైగా భూములు 22ఏ జాబితాలో ఉన్నాయి. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు నిషేధిత జాబితాలోకి చేరడంతో బ్యాంకు అధికారులు లోన్లు ఇవ్వడం లేదని, అత్యవసర సమయాల్లో అమ్ముకోలేకపోతున్నామని బాధిత రైతులు వాపోతున్నారు.

ఆసిఫాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకత కోసం అమలు చేస్తున్న 22ఏ జాబితా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. జిల్లాలోని వేలాది ఎకరాల పట్టా భూములను ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చడంతో క్రయవిక్రయాలకు ఆటంకం ఏర్పడుతోంది. రూ.లక్షలు పెట్టి వ్యవసాయ భూములు, ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివాహాలు, ఇతర అత్యవసర అవసరాలకు సొంత భూమిని అమ్ముకోలేక, బ్యాంకులో తాకట్టు పెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో చాలామందికి అవగాహన లేక 22ఏ జాబితా గురించి తెలియడం లేదు. క్రయవిక్రయాలు, బ్యాంకు లోన్లు, ఇతర అవసరాల సమయంలోనే తమ భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా గుర్తిస్తున్నారు.

పాస్‌ పుస్తకాలు ఉన్నా..

జిల్లాలో 2023లో 1,97,869 ఎకరాల అసైన్డ్‌ భూ ములు ఉండగా, ప్రస్తుతం 1,85,286 ఎకరాలు ఉ న్నాయి. 2023లో 5,26,945 ఎకరాల ప్రభుత్వ భూ మి ఉండగా, 2026లో 5,32,725 ఎకరాలు, 2023 లో 19,000 ఇతర ప్రభుత్వ భూములు ఉండగా, 2026లో 17,00 ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా దేవాదాయ, వక్ఫ్‌ భూములు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భూములు, సీలింగ్‌, అసైన్డ్‌ భూములు, కోర్టు వివా దాలు/విజిలెన్స్‌ ఆస్తులు, ప్రభుత్వం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ నిషేధించిన భూములను 22ఏ జాబి తాలోకి చేర్చుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండు లక్షల ఎకరాలను ఈ నిషేధిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. కానీ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ పట్టా పాసుపుస్తకాలు ఉన్నా కూడా 22ఏ జాబితాలో చూపించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి తప్పిదాలు సరిచేస్తామని ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తొలగడం లేదు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల పట్టా భూములను ఈ జాబితాలో చేర్చారంటూ ఇటీవల మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు బాధితులతో కలిసి కౌటాలలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

అధికారుల తప్పిదం.. ఆన్‌లైన్‌ చిక్కులు

కబ్జాలను అడ్డుకునే లక్ష్యంతో ప్రభుత్వ భూముల రక్షణ కోసం వాటి వివరాలను సేకరిస్తున్నారు. కానీ అధికారుల తప్పిదం, ఆన్‌లైన్‌ చిక్కులతో పట్టా భూములు కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేరా యి. రైతులు, భూయజమానులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తేగానీ భూములు నంబర్‌ 22ఏ లో ఉన్నట్లు తెలియడం లేదు. రెవెన్యూ శాఖ అధికారులు అన్‌లైన్‌ సర్వేలో జరిగిన పొరపాటే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములతోపాటు పట్టా భూములను క్షేత్రస్థాయిలో విచారణ లేకుండా గుడ్డిగా జాబితా తయారు చేశారని రైతులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి ప్రైవేటు భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు.

జిల్లా కేంద్రంలోనూ సమస్య

గ్రామీణ ప్రాంతాలతోపాటు ఏకంగా జిల్లా కేంద్రంలోనూ పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లిపోయాయి. ఆసిఫాబాద్‌ పట్టణంలో 66 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మరిన్ని భూములు ఈ జాబితాలో చేర్చారు. సర్వే నంబర్‌ 61, 62లో పైకాజీనగర్‌ కాలనీ ఉంది. ఈ కాలనీల్లో వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. 61 సర్వే నంబర్‌ వక్ఫ్‌ బోర్డు జాబితాలో ఉండగా, తాజాగా 62 సర్వే నంబర్‌ను 22ఏ జాబితాలో చేర్చారు. సర్వే నం.62లో సుమారు 16 ఎకరాలు ప్రైవేటు భూమి, మూడెకరాల బీడీపీపీ భూమి ఉంది. రెవెన్యూ అధికారులు ఈ సర్వే నంబర్‌ మొత్తాన్ని నిషేధిత జాబితా కింద చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. భూములు కొనుగోలు చేసిన యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్‌కు చెందిన అనార్థం తిరుపతి సర్వే నం.62లో 25 ఏళ్ల క్రితం ఓ ప్లాట్‌ కొనుగోలు చేశాడు. ఇటీవల సొంత అవసరాల కోసం ప్లాట్‌ను మరొకరికి విక్రయించాడు. మూడు రోజుల క్రితం రూ.1.30 లక్షల చలాన్‌ డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్తే మీ భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పారు. గతంలో ఈ సర్వే నంబర్‌లో క్రయవిక్రయాలు జరిగాయి. కానీ ఇప్పుడు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితుడు చెబుతున్నాడు.

పరిష్కార మార్గాలు ఇవే..

నిషేధిత జాబితాలో పట్టా భూములు ఉంటే ఆందోళన చెందకుండా వివిధ మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. bhubharati.telengana.gov.in లేదా dharani.telangana. gov. in పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి ఫోన్‌ నంబర్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతీ సోమవారం 22ఏ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహిస్తుంది. దరఖాస్తులను మూడు రోజుల్లో పరిశీలించి పరిష్కారానికి అర్హమైనవా.. కాదా.. అని నిర్ణయిస్తారు. వక్ఫ్‌, ఎండోమెంట్‌ భూములకు సంబంధించిన ఫిర్యాదులకు వక్ఫ్‌ సీఈవో లేదా ఎండోమెంట్‌ కమిషనర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే నిషేధిత జాబితా నుంచి భూమి వివరాలు తొలగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement