పొలిటికల్‌ వార్‌..! | - | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ వార్‌..!

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

● సిర్పూర్‌ నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం ● సోషల్‌ మీడియా, ప్రెస్‌మీట్‌లలో నాయకుల మాటల యుద్ధం

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎలాంటి ఎన్నికలు లేకపోయినా అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. ప్రధాన నాయకులతోపాటు మండల నాయకులు, సర్పంచ్‌లు నిత్యం ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వర్గీయులు సోషల్‌ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బీజేపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వర్గీయులు మాత్రం ఈ వివాదాలకు దూరం ఉంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.

హరీశ్‌రావు బహిరంగ సభ తర్వాత..

కౌటాల మండలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ఈ నెల 4న ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు. 22ఏ భూముల సమస్యలను ప్రస్తావించారు. అలాగే పలువురు నేతలు కాంగ్రెస్‌ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. కింది స్థాయి నాయకులు కూడా తమ నాయకులపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ మండలాల్లో సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

సోషల్‌ మీడియాలో రచ్చ

సిర్పూర్‌ నియోజకవర్గంలో పొలిటికల్‌ వార్‌ ఇప్పుడు చాయ్‌ దుకాణాల నుంచి సోషల్‌ మీడియాకు చేరింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, కార్యకర్తలు వాట్సాప్‌ గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ రీల్స్‌తో రచ్చ చేస్తున్నారు. మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతుండగా, స్థానిక ఎమ్మెల్యే, మరో ప్రధాన పార్టీ బీజేపీ మాత్రం ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. మౌనంగా ఉండడంతో భారతీయ జనతా పార్టీ ఏ వ్యూహం పాటిస్తుందోనని జనం చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement