విజృంభిస్తున్న విష జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

విజృంభిస్తున్న విష జ్వరాలు

Aug 24 2026 6:57 AM | Updated on Aug 24 2026 6:57 AM

● నమోదవుతున్న డెంగీ కేసులు

కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

ఆసిఫాబాద్‌: జిల్లాలో మలేరియా, వైరల్‌ జ్వరా లు విజృంభిస్తున్నాయి. సీజన్‌ మార్పుతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు దోమలు పెరిగాయి. వారం రోజులుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిత్యం పదుల సంఖ్యలో జ్వరంతో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ రోగులు చేరుతున్నారు. వీటితో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో విష జ్వరాలు, సీజనల్‌ వ్యాధులతో నిత్యం 50మంది, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ పదుల సంఖ్యలో జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఏటా వానాకాలం సీజన్‌ ప్రారంభంలో విషజ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలోని టీ హబ్‌లో 65 రకాల ఉచిత రక్తపరీక్షలు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 2,501 టైఫాయిడ్‌, 187 మలేరియా, 663 డెంగీ, 91 చికున్‌గున్యా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాలో 17 డెంగీ కేసులు

జిల్లాలో ఏటా డెంగీ కేసులు నమోదవుతున్నా యి. గతేడాది జిల్లాలోని పీహెచ్‌సీల్లో 87 డెంగీ, 38 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏ డాది ఇప్పటివరకు 17 డెంగీ, 21 మలేరియా కే సులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధి కారులు తెలిపారు. అనధికారికంగా ప్రైవేట్‌ ఆ స్పత్రుల్లోనూ మరికొందరు బాధితులు చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. డెంగీకి స్థానికంగా సరైన చికిత్స లభించక బాధితులు కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కరీంనగర్‌ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిర్వాహకులు రూ.వేలల్లో దండుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు కూడా చికిత్స అందిస్తున్నారు.

జాగ్రత్తలు పాటించాలి

సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి, వాంతులు, నీరసం తదితర లక్షణాలుంటే స్వయంగా మందులు వాడకుండా సమీప పీహెచ్‌సీని సంప్రదించాలి. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. పరిసరాల పరిశుభ్రత పాటించి దోమల నియంత్రణకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి.

– నాగేంద్ర, డీఎంహెచ్‌వో

లోపిస్తున్న పారిశుద్ధ్యం

జిల్లాలో ఏటా వానాకాలంలో పారిశు ద్ధ్యం లోపిస్తోంది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడం, గ్రామాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతోపాటు డ్రైనేజీలు పూడికతో నిండి దుర్గంధం వ్యాపిస్తోంది. కాలనీల్లో పిచ్చి మొక్కలు పెరిగి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీతోపాటు విషజ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామాల్లోనూ మురుగు కాలువలు నిండిపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా నిరుపేదలు నివాసముండే మురికి వాడల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా కేంద్రంలో అడపాదడప ఫాగింగ్‌ చేస్తున్నా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. గతంలో డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో లార్వా పెరగకుండా కెమికల్‌ బాల్స్‌ వేసేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఎక్కడా నిర్వహించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement