ఆసిఫాబాద్‌అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి అడ్డుకోవడం సరికాదని, ఇదే కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావుతో కలిసి మాట్లాడారు. జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు వాస్తవాలు మాట్లాడారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా నిర్మించకపోవడంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. వ్యక్తిగతంగా మంత్రిని విమర్శించడం ఎమ్మెల్యే స్థాయికి తగదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఇప్పటికై నా ఆపాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు తారిఖ్, భీంరావ్, మారుతి, వినోద్, శంకర్, మెంగాజీ, నారాయణ, విజయ, విమల, సాయికుమార్, తిరుపతి, ప్రసాద్, గణేష్, పెంటు, కిషన్, దేవిదాస్, హన్మంతు, విశ్వనాథ్ పాల్గొన్నారు.


