కౌటాల: నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఉద్యోగం ఇప్పిస్తామని గాలం వేస్తున్నారు. అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో బాధితులు అప్పులు చేస్తూ బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు చెల్లిస్తున్నారు. జిల్లాలో చాలామంది బాధితులు తమ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక మనోవేదనకు గురవుతున్నారు. నిందితుల చుట్టూ సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ కాళ్లరిగేలా తిరిగినా లాభం లేకుండా పోతోంది. జిల్లాలోని 335 గ్రామాల్లో చాలావరకు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన యువతీ యువకులకు సైతం సరైన అవగాహన ఉండటం లేదు. వీరి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతే లక్ష్యంగా నేరగాళ్లు బరితెగిస్తున్నారు. ఉద్యోగాల పేరిట గాలం విసిరి రూ.లక్షల్లో దోచేస్తున్నారు. అలాగే వారి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. మరికొందరిని చైన్ సిస్టం మాదిరిగా వలలోకి లాగుతున్నట్లు సమాచారం. తమ కంపెనీ ఉద్యోగాల్లో చేరడానికి రూ.30 వేలు చెల్లించాలని, ఆ నగదు చెల్లించాక బ్రాండ్ పేరిట వస్తువులను అంటగడుతున్నారు. ప్రతి సభ్యుడూ మరో ముగ్గురితో సభ్యత్వం చేయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. నెలకు రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు కమిషన్ వస్తుందని మాయమాటలు చెబుతున్నారు.
పార్ట్‌టైం జాబ్‌ల పేరిట మోసం
జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో నిరుద్యోగ యువకులకు పార్ట్‌టైమ్ జాబ్‌లంటూ మోసం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై ప్రకటనలతో గారడీ చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉంటున్నారు. మరోవైపు చాలామంది మహిళలు ఇంటి వద్దే ఉంటూ పనిచేయడానికి ఇష్టపడతుండగా, స్కామ్‌లు చేసేవాళ్లు వీరినే ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతోనే నెలకు వేలాది రూపాయలు సంపాదించవచ్చని నమ్మిస్తున్నారు. బాధితులు రూ.500 చెల్లిస్తే వారి ఖాతాల్లోకి రూ.1000 జమ చేస్తున్నారు. అధిక డబ్బులు వస్తాయనే ఆశ కల్పించి రూ.5 వేలు, రూ.10 వేల వరకు యాప్‌లో జమ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఎక్కువ మొత్తం డబ్బు సమకూరిన తర్వాత యాప్ క్లోజ్ చేస్తున్నారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలపై యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


