సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్‌కు ముందడుగు పడుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించనుండగా ముంపు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర నుంచి బరాజ్ ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించాలంటూ సాగు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలతో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 148మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. తాజాగా మరో నాలుగు మీటర్లు ఎత్తు పెంచి, 152 మీటర్ల బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ముంపుపై మహారాష్ట్రతో అనుమతులు వస్తేనే ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు కానుంది. బ్యారేజీని కనీసం 150నుంచి 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అవకాశముంటుంది. దీంతో విద్యుత్ వినియోగం లేకుండానే కాలువల ద్వారా నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓ సర్వే సంస్థ వార్దా, పెన్‌గంగ కలిసే చోట 165 టీఎంసీలు నీటి లభ్యత ఉన్నట్లు అంచనా ఉన్నట్లు సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని గ్రావిటీతో తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు, ఆపై మిడ్ మానేరుకు అటు నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో ఏళ్లుగా ఈ ప్రాంత రైతాంగం పడుతున్న సాగు నీటి గోస తీరే అవకాశముంది.
కుట్టు మిషన్లతో మహిళలకు ఉపాధి
పనులు మొదలైతేనే ఊరట
2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మాణంతో ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో 16లక్షల ఎకరాలకు నీరందాలి. ఇందులో ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలోనే 2లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే, ప్రాజెక్ట్‌పై పట్టింపు లేకపోవడంతో ముందుకు సాగలేదు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మరుగునపడింది. మధ్యలో పలుసార్లు వార్దా, పెన్ గంగలపై ప్రత్యామ్నాయంగా బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. అయితే, ఆ ప్రతిపాదనలేవి ముందుకు సాగలేదు. ఇక ఇప్పటికే ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం తవ్విన కాలువలు కబ్జాలకు గురయ్యాయి. భూ సేకరణ పూర్తయి భూములు వృథాగా ఉన్నాయి. కాలువల కోసం వినియోగించే పైపులను కూడా తరలించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆశలు వదులుకున్నారు. అయితే, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేయగా, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ముందడుగు పడుతోంది. గత రాష్ట్ర బడ్జెట్‌లోనూ రూ.248కోట్లు ప్రతిపాదించారు. మహారాష్ట్రలో భూముల ముంపు సమస్య పరిష్కారమైతే ప్రాజెక్ట్ నిర్మాణానికి మార్గం సులువు కానుంది.


