ఆసిఫాబాద్‌రూరల్: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో తొలి విద్యాభ్యాసమే చిన్నారుల భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్‌లో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులపై ఒత్తిడి లేకుండా ఆటపాటలు, సంభాషణలు, చిత్రలేఖనం ద్వారా నేర్చుకునేలా చొరవ చూపాలన్నారు. పిల్లల్లో భాషా నైపుణ్యాలు, సంఖ్యా భావనలు, ఆలోచనలు, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎంలు మార్గదర్శకత్వం వహించాలన్నారు. ఇండోర్, అవుట్ డోర్ ప్లే మెటీరియల్, టీఎల్‌ఎం, చిత్రాలు, పుస్తకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో సచ్చిదానంద చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, రిసోర్స్‌పర్సన్లు శంకర్, వెంకటేశ్, ప్రిన్సిపాల్ మహేశ్వర్ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, డీఆర్‌వో దాసరి వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, కృష్ణయ్యతో కలిసి జిల్లా అధికారులతో పంద్రాగస్టు వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న వేడుకల్లో పోలీస్ గౌరవ వందనం, పతాకావిష్కరణ, వేదిక అలంకరణ, పోడియం, వాహనాలను పూలతో అలంకరించడం, షామియానాలు, కుర్చీలు, తాగునీరు, స్నాక్స్, టీ, స్టాల్స్ ఏర్పాటు, శకటాలు, సౌండ్ సిస్టం, ప్రసంగ ప్రతి, ప్రముఖుల సీటింగ్ నిర్వహణ, ఫొటోగ్రఫీతో పాటు మీడియా గ్యాలరీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలన్నారు.


