కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి విభేదాలు డీసీసీ మార్పుపై ఓ వర్గం పట్టు చర్చనీయాంశంగా ‘గాంధీభవన్’ పంచాయితీ నాన్‌లోకల్ అనడంపై ఆత్రం సుగుణ ఫైర్
ఆసిఫాబాద్: జిల్లా అధికార పార్టీ నాయకుల చేతులు కలవడం లేదు. వర్గ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతల్లో విభేదాలు కొత్త కాకాపోయినా ఇటీవల ఏజెన్సీ మండలాల్లో కొందరు నాయకులు బహిరంగంగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ తమ నిరసన తెలిపారు. ఇప్పుడు ఏకంగా డీసీసీ అధ్యక్షురాలిపై అసంతృప్తితో ఉన్న ఓ వర్గ నాయకులు, కార్యకర్తలు ఏకంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సీనియర్లను విస్మరిస్తూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. జిల్లా, మండల స్థాయి పదవుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ విలేకరుల సమావేశం నిర్వహించి.. నాన్‌లోకల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
గతంలోనూ వర్గపోరు
కాంగ్రెస్ పార్టీలో గతంలోనూ పలుమార్లు వర్గపోరు బహిర్గతమైంది. స్థానిక నాయకత్వం, ఎన్నికల సీట్ల కేటాయింపు, నిధుల విషయంలో విబేధాలు బయటపడ్డాయి. ఒకసారి ఏకంగా రాష్ట్ర నాయకుల సాక్షిగా కుర్చీలు విసురుకోవడం గమనార్హం. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించి భంగపడ్డవారు స్వతంత్రంగా పోటీ చేశారు. ఫలితంగా పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదవులు, నామినేటెడ్ పోస్టుల పంపిణీలో సమన్వయం లోపిస్తోంది. నేతల తీరుతో క్యాడర్‌లోనూ అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
జిల్లా అధ్యక్షురాలిని మార్చాలని..
ప్రస్తుతం కాంగ్రెస్ వర్గపోరు మొత్తం డీసీసీ పీఠం చుట్టూనే తిరుగుతోంది. జిల్లా అధ్యక్షురాలిని తక్షణమే మార్చాలని వ్యతిరేక వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా డీసీసీ అధ్యక్షుడిగా కొక్కిరాల విశ్వప్రసాదరావు పనిచేశారు. రాష్ట్రంలో అధికారంలో కొలువుదీరిన తర్వాత పరిణామాలతో రాష్ట్ర నాయకత్వం కొత్త అధ్యక్షుల నియామకాల వైపు మొగ్గు చూపింది. ఇందులో భాగంగా డీసీసీ పీఠం కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో ఆదివాసీ మహిళ అయిన ఆత్రం సుగుణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఆ పదవిని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో అసమ్మతి నేతలు ఆత్రం సుగుణను స్థానికేతర నేత అంటూ గాంధీభవన్ మెట్లెక్కారు. రాష్ట్ర నాయకత్వం అందరినీ సమన్వయం చేసుకోకపోతే స్థానికంగా పార్టీకి నష్టం తప్పదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.


