అభివృద్ధి పనులు చేపట్టేందుకు పూర్తి సమాచార సేకరణ గ్రామ సభల్లో ప్రతిపాదనలు రూపకల్పన జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు
ఆసిఫాబాద్: పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అవసరమైన డేటా సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఒక ప్రత్యేక ఫార్మాట్ అందజేశారు. ఈ నెల 4న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్ మాదిరిగా పంచాయతీ స్థాయిలో అదే విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) కింద ప్రతీ గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అభివృద్ధి పనులు, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. విద్య, వైద్య, అటవీ, రెవెన్యూ, పౌరసరఫరాలు, డీఆర్‌డీఏతో పాటు 17 శాఖలతో సమావేశాలు నిర్వహించి, పల్లెల అవసరాలు తెలుసుకోనున్నారు. తద్వారా జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలకు లబ్ధి చేకూరనుంది. గ్రామ సభలు నిర్వహించి మండలాల వారీగా పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. విలేజ్ ప్రొఫైల్ తయారైతే ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టే అవకాశం ఉంది. గ్రామ జనాభాకు అనుగుణంగా రోడ్లు, తాగునీరు, విద్య, వైద్య తదితర మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపడనున్నాయి.
యాప్‌లో సమగ్ర సమాచారం
గ్రామ పంచాయతీల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తే నుంది. గ్రామ ఆవిర్భావం, ప్రొఫైల్ నుంచి మూడేళ్లలో ఏం చేయాలి, ఎంత బడ్జెట్ అవసరం ఉంది.. ఏ శాఖ నుంచి ఎంత ఖర్చు చేస్తున్నారు.. అనే పూర్తి వివరాలను 39 రకాల అంశాలతో డిజిటలైజ్ చేయనున్నారు. దీంతో ఒక్క క్లిక్‌తో గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి రానుంది. స్థానిక వనరుల ఆధారంగా పల్లెల అభివృద్ధి సాధనతో పాటు నిధుల్లో అవినీతి అక్రమాలను నియంత్రించడం, ప్రతీ పైసాకు లెక్క ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. గ్రామ సభల ద్వారా ప్రజల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, మూడేళ్లలో గ్రామాభివృద్ధి చేపట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పంచాయతీలో నాలుగు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
కార్యదర్శులకు శిక్షణ పూర్తి
జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ పూర్తయ్యింది. ఇప్పటికే పంచాయతీరాజ్ కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. గ్రామ సభల్లో సేకరించిన సమాచారం ఆధారంగా గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపడతాం.
– భిక్షపతి, జిల్లా పంచాయతీ అధికారి
విలేజ్ ప్రొఫైల్
వాంకిడి పంచాయతీ కార్యాలయం
పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను మూడు భాగాలుగా వర్గీకరించారు. మొదటి భాగంలో విలేజ్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. ఇందులో గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. గ్రామం, విస్తీర్ణం, సరిహద్దులు, లొకేషన్, జనాభా, సీ్త్రలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఖ్య, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, బిల్ కలెక్టర్, మల్టీపర్సస్ వర్కర్ల వివరాలు నమోదు చేయనున్నారు. సాగుభూమి, బోరుబావులు, కుంటలు చెరువులు, కాల్వలు, రహదారులు, వీధి దీపాలు, డ్రెయినేజీలు, హెల్త్ సబ్ సెంటర్లు, బ్యాంకులు, రేషన్ దుకాణాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, క్రీడాప్రాంగణాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పశు వైద్యశాలల వివరాలు నమోదు చేయనున్నారు. అలా గే పంచాయతీల ఆదాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, ఆసరా పింఛన్లు, గతంలో ఖర్చు చేసిన వివరాలు అప్‌లోడ్ చేస్తారు.


