జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నాయకులు వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, తనను నాన్‌లోకల్ అనడం దివాలాకోరుతనమని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కొంతమంది కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేసి అభివృద్ధి పనులిప్పిస్తామంటూ హైదరాబాద్ గాంధీ భవన్‌కు తీసుకెళ్లి తనపై ఆరోపణలు చేయించారన్నారు. కొందరు నాయకులు కలిసి ఆడుతున్న రాజకీయ నాటకమని ఆరోపించారు. నాన్‌లోకల్ అంటున్న వారు ముందుగా తన గురించి తెలుసుకోవాలని, సిర్పూర్–యు మండలం పుల్లార గ్రామంలో పుట్టిన ఆదివాసీ బిడ్డనని స్పష్టం చేశారు. ఆదివాసీ బిడ్డను నాన్‌లోకల్‌గా చిత్రీకరించడం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనన్నారు. 1995లో కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా గెలిచానని, అప్పటి నుంచి పార్టీ మారలేదని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా పార్టీ తనకు ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం తన పనితీరు, నిబద్ధతను గుర్తించిన అధిష్టానమే టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా, డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వీధుల్లో నిలబడి ప్రశ్నించడం అంటే అధిష్టానాన్ని సవాల్ చేయడమే అన్నారు. పార్టీ క్రమశిక్షణను దెబ్బతీసే చర్యలను ఏమాత్రం సహించబోనని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, ఆత్మ చైర్మన్ గడ్డల సత్తయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రాపర్తి మురళి, ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా, నాయకులు జి.మల్లేశ్, తారిక్, భీమ్‌రావు, నాంపల్లి శంకర్, కమల్‌నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


