ప్రజా‘వాణి’ మరింత చేరువ! | - | Sakshi
Sakshi News home page

ప్రజా‘వాణి’ మరింత చేరువ!

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

ప్రతీ సోమవారం మండల కేంద్రాల్లో అర్జీల స్వీకరణ ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక డెస్క్‌ ఏర్పాటు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై ప్రజల ఆశలు

కెరమెరి: ప్రజలు జిల్లా కేంద్రం వరకు వెళ్లకుండా మండల స్థాయిలోనే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకోసం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. గతంలోనూ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అలాగే కాగజ్‌నగర్‌లో సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోనూ కొనసాగింది. కానీ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా బదిలీ తర్వాత నిర్వహించడం లేదు. మండల కేంద్రాల్లో అధికారులు హాజరుకాకపోవడం, వినతుల పరిష్కారం కాకపోవడంతో ప్రజలు కలెక్టరేట్‌కు వెళ్లడానికే ప్రాధాన్యమిచ్చారు. అయితే ఈసారి మాత్రం కార్యక్రమాన్ని నామమాత్రంగా కొనసాగించకుండా ప్రతీ ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. సంబంధిత అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.

నోడల్‌ అధికారిగా ఎంపీడీవో

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మండల కేంద్రాల్లో 15 ఎంపీడీవో కార్యాలయాలు ఉన్నాయి. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవో నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. తహసీల్దార్‌, మండల పంచాయతీ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, విద్య, వైద్యం, విద్యుత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, అటవీ, గృహనిర్మాణ, రోడ్లు, భవనాలు, నీటి పారుదల తదితర శాఖల అధికారులు తప్పక హాజరుకావాల్సి ఉంది. ప్రతీ ఫిర్యాదును పోర్టల్‌లో నమోదు చేసి ఫిర్యాదుదారుడికి ఐడీతో రశీదు ఇస్తారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్నెట్‌ సౌకర్యంతో కూడిన కంప్యూటర్‌, స్కానర్‌తో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.

సమస్యలు పరిష్కారమయ్యేనా..?

జిల్లాలోని పలు మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయి. ప్రతీ సోమవారం ప్రజావాణికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు గిరిజనులు ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయంలోనూ వినతులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో పింఛన్లు, రేషన్‌, భూ సమస్యలు, తాగునీరు, విద్యుత్‌, రహదారులు, సంక్షేమ పథకాలు, వ్యవసాయం, ఉపాధి వంటి అంశాలపై వినతులు ఇవ్వడానికి మండల ప్రజావాణి ఒకే వేదికగా ఉపయోగపడనుంది. ప్రతీ అర్జీని ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ప్రత్యేక ఐడీ ఇవ్వనున్నారు. అలాగే గడువులోగా పరిష్కరించడం, పర్యవేక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. అయితే స్థానికంగా మండల అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయడం, గడువులోగా పరిష్కరించడం, తదితర నిబంధనల కారణంగా పర్యవేక్షణ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement