ఆప్రమత్తతే ఆయుధం | - | Sakshi
Sakshi News home page

ఆప్రమత్తతే ఆయుధం

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింక్‌లు ఓపెన్‌ చేయొద్దు గోల్డెన్‌ అవర్‌లో స్పందిస్తే నగదు రికవరీకి అవకాశం కాగజ్‌నగర్‌లో సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించిన ఎస్పీ

కాగజ్‌నగర్‌టౌన్‌: సైబర్‌ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తూ చాలా మంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. ఉన్నత చదువులు చదివి, సాంకే తిక విషయాలపై అవగాహన ఉన్నవారు సైతం సైబర్‌ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో సైబర్‌ జాగృత దివాస్‌ సురక్షకా తిరంగా సైబర్‌ భద్రత కార్యక్రమంలో భాగంగా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం హెచ్‌ఆర్‌డీ హాలులో బుధవారం సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ నితిక పంత్‌ ఆధ్వర్యంలో అధిక పెట్టుబడి, ఆన్‌లైన్‌ మోసాలు, సోషల్‌ మీడియా నేరాలు, సైబర్‌ బుల్లీయింగ్‌, ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ స్టాకింగ్‌ వంటి అంశాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. డీఎస్పీ వహీదుద్దీన్‌, సీఐ ప్రేమ్‌కుమార్‌, కుమారస్వామి, ఎస్సైలు, ఎంఈఓ ప్రభాకర్‌, ఎఫ్‌ఎస్‌ఓ, యువకులు, సీనియర్‌ సిటిజన్స్‌, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ అనుభవాలు పంచుకున్నారు.

ఏపీకే ఫైళ్లు డేంజర్‌

రాష్ట్రంలో ఒక్క రోజులోనే సైబర్‌ నేరాలతో సుమారు రూ.5 కోట్ల మేర ప్రజలు నష్టపోతుండగా, దేశవ్యాప్తంగా రోజుకు సుమారు రూ.70 కోట్ల వరకు నష్టం జరుగుతోంది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి సైబర్‌ నేరగాళ్లు అమాయకుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. అనుమానాస్పద ఏపీకే ఫైళ్లు, లింకులతోనే చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్‌ చేయకూడదు. బ్యాంకింగ్‌, సోషల్‌ మీడియా డిజిటల్‌ సేవలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను తరచూ మార్చాలి. ఓటీపీలు, బ్యాంకుల వివరాలు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. సమీప పోలీస్టేషన్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులను కూడా సంప్రదించాలి. గోల్డెన్‌ అవర్‌లో స్పందిస్తే నగదు రికవరీకి అవకాశం ఉంటుందని ఎస్పీ వివరించారు.

ఈ ఏడాది సైబర్‌ మోసాల వివరాలు

మొత్తం పిటిషన్లు 262

ఎఫ్‌ఐఆర్‌లు 27

కోల్పోయిన నగదు రూ.2,62,86,270

హోల్డ్‌లో ఉంచిన మొత్తం రూ.49,45,308

బాధితులకు తిరిగి అందించిన మొత్తంరూ.7,25,709

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement