ఆసిఫాబాద్: జిల్లాలో కాంగ్రెస్ నాయకుల వర్గపోరు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరింది. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు వందమందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంధీ భవన్‌కు తరలివెళ్లారు. పార్టీ పదవుల కేటాయింపుల్లో సీనియర్ కార్యకర్తలను విస్మరించారని, స్థానికేతరురాలైన సుగుణను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రెబ్బెన మాజీ ఎంపీపీ సోమయ్య, ఆర్టీఏ సభ్యుడు లావుడ్య రమేశ్‌తోపాటు పలువురు మాట్లాడుతూ మండల స్థాయి పార్టీ పదవుల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కోల్పోవడంతోపాటు మండల అధ్యక్ష నియామకాల్లో ఏకపక్ష నిర్ణయాలు, ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏల నియామకాల్లో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు. ఎస్సీ, మైనార్టీ సెల్ నియామకాల్లోనూ సామాజిక సమతుల్యత లోపించిందని, పీఎసీఎస్ నామినేటెడ్ పదవుల విషయంలోనూ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో 95 శాతం పదవులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించినట్లు ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు అహ్మదుల్లా, మహేశ్‌గౌడ్, సుదర్శన్ గౌడ్, శెండె దత్తు, మాజీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


