కాగజ్‌నగర్‌టౌన్: దేశ నిర్మాణంలో జవహర్ నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. పట్టణంలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం 39వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ నవో దయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులు, విద్యాలయానికి పేరు తీసుకురావాలని సూచించారు. అంతకు ముందు ఎమ్మెల్సీని విద్యార్థులు స్కౌట్‌తో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ, ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేశ్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


