ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తాగునీరు అందడం లేదని, సమస్య పరిష్కరించాలని లింగాపూర్ మండలం పిట్టగూడ గ్రామస్తులు వినతిపత్రం అందించారు. పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 వాహనం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. రెబ్బెన మండలం దేవలగూడలో యూటర్న్ మూసివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, తక్షణమే యూటర్న్‌ను పునరుద్ధరించాలని గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్నారు. కెరమెరి మండలం సాంగ్వి గ్రామంలో 2024లో మంజూరైన సీసీ రోడు పనులు పూర్తి చేసిన నేపథ్యంలో బకాయిలు ఇప్పించాలని రమేశ్ విన్నవించాడు. వాంకిడి మండలం గోయగాం గ్రామంలోని తెలంగాణ– మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నాగదేవత భీమన్న గుడిలో బోర్‌వెల్ తొలగించారని, తిరిగి వేయించాలని భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. మూడెకరాల భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటుతామని బెదిరిస్తున్నారని, ఉమ్మడి సర్వే చేపట్టి కొత్త పట్టా ఇప్పించాలని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పుల్లుబాయి దరఖాస్తు చేసుకున్నారు. మరణించిన తన భర్త పేరుమీద ఉన్న అటవీ భూమి హక్కు పత్రాలు మార్చాలని రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జరుపుల జుమ్లిభాయి వేడుకుంది. రైతు భరోసా నిధులు జమ చేయాలని సిర్పూర్(యూ) మండలం మహాగావ్ గ్రామానికి చెందిన రామె అర్జీ అందించాడు.
ఇల్లు మంజూరు చేయాలి
నాకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు ఆన్‌లైన్‌లో చూపించింది. కానీ అధికారులు మాత్రం రాలేదని చెబుతున్నారు. పట్టణంలోని కంచుకోటలో చిన్న గుడిసెలో ఉంటున్నాం. రెండో జాబితాలోనైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి.
– ఖైరున్నీసా, ఆసిఫాబాద్
పింఛన్ మంజూరు చేయాలి
అనారోగ్యంతో బాధపడుతున్నా. వివాహం కానందు న ప్రభుత్వం ఒంటరి మహిళా పింఛన్ మంజూరు చే యాలి. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
– సమీర సలక్క, చింతలమానపల్లి


