ఆసిఫాబాద్: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ పథ కం అమలు వేగవంతం చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కా న్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ప్రకాశ్, డిప్యూటీ ఈఈ వేణుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో లబ్ధిదారుల డెస్క్ పరిశీలన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10 లోపు, కెరమెరి మండలంలో 13 దరఖాస్తులు మా త్రమే పెండింగ్ ఉన్నందున మంగళవారం నాటికి డెస్క్ పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. సిర్పూర్–టి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్, వాంకిడి, లింగాపూర్, రెబ్బెన మండలాల్లో వందలోపు దరఖాస్తులు పెండింగ్ ఉన్నందున శనివారం సాయంత్రంలోగా పరిశీలన పూర్తి కావాలన్నారు. ఎల్– 1, 2, 3 జాబితాల్లోని లబ్ధిదారుల వివరాలు పరిశీలించి, ప్రజావాణిలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన 500 రూఫ్ రీప్లేస్‌మెంట్ ఇళ్ల పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్‌సీ లెవల్‌లో ఉన్న 2,712 ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డెస్క్, క్షేత్రస్థాయి పరిశీలనలు గడువులోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


