ముఖం చాటేసిన వరుణుడు
రాత్రిపూట వాగు నీటిని పారతో మోటరు వైపు మళ్లిస్తున్న ఈ రైతు పేరు గుర్లె భీంరావు. రెబ్బెన మండలం గంగాపూర్‌లో కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. వర్షాలు లేక తోట ఎండిపోతోంది. ఈ సమయంలో మోకాలు లోతు నీటితో ప్రవహించాల్సిన గంగాపూర్ వాగు వర్షాలు లేక వరద పూర్తిగా తగ్గింది. పగటి పూట వాగు నీరు రెండు మోటర్లకు కూ డా సరిపోవడం లేదు. రాత్రిపూట తోటకు నీరు పెట్టా లని పార చేతపట్టుకుని నీటిని మోటర్ వైపు మళ్లి స్తున్నాడు. వర్షాకాలంలో ఇ లాంటి పరిస్థితి ఉంటుందని అస్సలు ఊహించలేదని భీంరావు వాపోతున్నాడు.
రెబ్బెన: ఎల్‌నినో ప్రభావం జిల్లా రైతులను కుదేలు చేస్తోంది. కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతమవుతున్నా.. వర్షం కురిపించకుండానే మబ్బులు వెళ్లిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు ముందుకు సాగడం లేదు. పత్తి, వరి తోపాటు అన్ని రకాల పంటలు నీటి కోసం తల్లడిల్లుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుండటంతో భూమిలో తేమ ఆవిరైపోతోంది. సోమవారం రెబ్బెన మండలం గోలేటిటౌన్ షిప్‌లో 38.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదుకాగా, మంగళవారం 38.4 డిగ్రీలుగా నమోదైంది. జిల్లావ్యాప్తంగా 4.52 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. 3.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అంచనా ఉండగా, జిల్లాలో దాదాపు 95 శాతం రైతులు ఇప్పటికే విత్తనాలను విత్తుకున్నారు.
నెర్రలుబారుతున్న పొలాలు, చేలు
బోర్లు, వాగులకు సమీపాన వ్యవసాయ క్షేత్రాలు ఉన్న రైతుల్లో కొంతమంది ఇప్పటికే వరినాట్లు వేశారు. సాధారణ వర్షపాతం కంటే తక్కువ స్థాయిలో వర్షం పడటంతో భూమిలో తేమ నిలవ డం లేదు. పెరిగిన ఉ ష్ణోగ్రతల కారణంగా పొలాలకు నీరు సరిపోవడం లేదు. రోజంతా బోర్లు నడిచినా ఒక్క మడి తడవని పరిస్థితి. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయి. పొలాలు నెర్ర లు బారుతున్నాయి. ప్రారంభ దశలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ముందు ముందు పరిస్థితి మరేలా ఉంటుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ట్రాక్టర్ ఖర్చులు, వరినాట్లు, రసాయనిక ఎరువులు కోసం రూ.వేలల్లో ఖర్చు చేశారు. మరో పది రోజులు వర్షాలు రాకపోతే నాట్లు వేసిన పొలాలు కూడా ఎండిపోతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొన్ని మండలాల్లో 15 రోజులు గా ఇప్పటికీ చిన్నపాటి చిరుజల్లులు కూడా పడకపోవడంతో పత్తి మొక్కలు ఎండకు తాళలేక వడలిపోతున్నాయి. ప్రారంభంలో కురిసిన అరకొర వర్షాలకే చాలామంది తొందరపాటుతో విత్తనాలు విత్తుకున్నారు. ముందుగా వేసిన విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తకపోవడంతో రెండోసారి విత్తుకోవాల్సి వచ్చింది. ఆ మొలకలు కూడా మాడిపోయే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వర్షాల కోసం పూజలు చేస్తున్నారు.
ఆయిల్ ఇంజిన్‌తో నీటితడులు
పెంచికల్‌పేట్: వరినారు
కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లను పడుతున్నారు. పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లి శివారులో కంది పెంటయ్య అనే రైతు బొక్కివాగులో ఆయిల్ ఇంజన్ ఏర్పాటు చేసి పైపు లైనుతో నారుమడికి నీరు అందిస్తున్నాడు.
మండలాల వారీగా వర్షపాతం(మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది లోటు
జైనూర్ 365.3 307.8 –16.0
సిర్పూర్(యూ) 331.1 306.5 –7.0
లింగాపూర్ 326.3 280.4 –14.0
తిర్యాణి 283.1 248.3 –12.0
రెబ్బెన 275.1 163.2 –41.0
ఆసిఫాబాద్ 313.8 263.5 –16.0
కెరమెరి 307.8 340.1 10.0
వాంకిడి 329.3 266.9 –19.0
కాగజ్‌నగర్ 307.2 161.9 –47.0
సిర్పూర్(టి) 341.9 341.8 0.0
కౌటాల 369.0 355.4 –4.0
చింతలమానెపల్లి 363.2 320.8 –12.0
బెజ్జూర్ 382.1 145.1 –62.0
పెంచికల్‌పేట్ 351.3 234.9 –33.0
దహెగాం 364.5 205.1 –44.0
చెరువులు, కుంటలు
వెలవెల
జిల్లాలోని చెరువులు, కుంటలు గతేడాది ఈ సమయానికి దాదాపు 80 శాతం నీటితో కళకళలాడాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడ లేకపోవడంతో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఈ నెల 14 వరకు జిల్లా సగటు సాధారణ వర్షపాతం 334.1 మిల్లీమీటర్లు కాగా, 262.8 మి.మీ.లుగా నమోదైంది. 21 శాతం లోటు ఉంది. గత నెలలో 18 మి.మీ.ల లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సుమారు 50వేల ఎకరాల వరకు వరిసాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే ఈసారి వరిసాగు 10వేల ఎకరాలలోపే ఉండే అవకాశం ఉంది. ప్రధాన సాగునీటి వనరులైన అడ, వట్టివాగు, పీపీ రావు ప్రాజెక్టుల్లో సైతం నీళ్లు లేవు.


