కెరమెరి మండలం సుర్దాపూర్‌లో 980 మంది ఓటర్లు ఉన్నారు. వారు బీఎల్‌వోలు ఇచ్చిన ఫారాలను నింపకుండానే తీసుకువస్తున్నారు. ఇక్కడ ఒకే బీఎల్‌వో ఉండడంతో సర్పంచ్ సాయంతో మరో ఇద్దరు వలంటీర్లను నియమించుకున్నారు. ఓటర్లు చెప్పే సమాచారం ఆధారంగా వలంటీర్లు ఫారాలు నింపుతున్నారు. ఆ తర్వాత వాటిని బీఎల్‌వో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఓటరు పేరు చహకటి అనసూయ. రింగన్‌ఘాట్ సర్పంచ్. ఈమె వివాహం 2021లో జరిగింది. 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని దాబా గ్రామంలో నివాసం ఉంటున్న వారి తల్లిదండ్రుల వివరాలు కావాలి. అక్కడ మొబైల్ సిగ్నల్స్ సక్రమంగా లేకపోవడంతో వివరాల కనుక్కోవడం ఆలస్యమైంది.
కెరమెరి: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వేగంగా సాగుతున్నా.. వివరాలు నింపడంలో కొన్ని ప్రాంతాల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరక్షరాస్యులు, ఏజెన్సీ ప్రాంత ప్రజలతోపాటు చదువుకున్న వారు సైతం తికమక పడుతున్నారు. చాలా చోట్ల బీఎల్‌వోలే స్వయంగా ఫారాలు నింపడంతోపాటు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. కొన్నిచోట్ల పని త్వరగా పూర్తిచేసేందుకు వలంటీర్లను సైతం నియమించుకున్నారు. జూన్ నెల 25న ప్రారంభమైన సర్ ప్రక్రియ ఈ నెల 24తో ముగియనుంది.
నెట్‘వర్క్’ పనిచేయక..
జిల్లాలోని సగం మండలాలు మారుమూల ప్రాంతాలకు చెందినవే. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాణి మండలాల్లోని అత్యధిక గ్రామాలు మొబైల్ సిగ్నల్స్‌కు దూరంగా ఉన్నాయి. ఆయా గ్రామాలకు బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపేందుకు వెళ్లినప్పుడు నెట్‌వర్క్ లేకపోవడంతో యాప్ పనిచేయడం లేదు. ప్రతిరోజూ కనీసం 50 నుంచి 70 ఫారాల వరకు ఆన్‌లైన్ చేయాల్సి ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో 30, 40 కూడా దాటడం లేదు. సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటున్నారు. ఒక్కో ఫారం అప్‌లోడింగ్‌కు 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుందని వారు చెబుతున్నారు.
అర్ధరాత్రి వరకు పనిచేస్తున్న..
ఫారాలు పూరించడం, యాప్‌లో అప్‌లోడ్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. సిగ్నల్ సమస్య కారణంగా సాయంత్రం ఇంటికి వెళ్లి అర్ధరాత్రి వరకు వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. 980 మందికి ఫారాలు పంపిణీ చేశాను.
– ఆత్రం బొజ్జుబాయి, బీఎల్‌వో, సుర్దాపూర్
జిల్లాలో సర్ వివరాలు
శిక్షణ కల్పించినా.. అవగాహన తక్కువే
బీఎల్‌వోలకు సమగ్ర శిక్షణ అందించినా క్షేత్రస్థాయిలో ప్రజలు అడిగే పలు సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులపై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. 2002 ఓటరు జాబి తా వివరాలు తెలుసుకోవడం ఓటర్లకు ప్రధాన సమస్యగా మారింది. నిరాక్షరాస్యులకు అప్పటి కార్డు నంబరు ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. ఇదిలా ఉంటే కొత్త కోడళ్లకు మరో విధమైన సమస్యలు ఎదురవుతున్నాయి. 2002 నాటి రికార్డుల కోసం పుట్టింటి నుంచి సమా చారం తెలుసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు ఫోన్లు లేకపోవడం, మొబైళ్లు ఉన్నా నెట్‌వర్క్ లేకపోవడం సమస్యగా మారింది.


