అమ్మాయిల అమ్మకం! | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిల అమ్మకం!

Mar 20 2026 8:20 AM | Updated on Mar 20 2026 8:20 AM

జిల్లాలో మానవ అక్రమ రవాణా కలకలం బెజ్జూర్‌ మండలం నుంచి మధ్యప్రదేశ్‌ కు ఇద్దరు యువతుల తరలింపు! ఒక్కొక్కరిని రూ.2.40లక్షల చొప్పున విక్రయించినట్లు సమాచారం పోలీసుల అదుపులో ముఠా సభ్యులు నేడో, రేపో అరెస్టు చూపనున్న పోలీసులు

కౌటాల: అమాయక గిరిజన యువతులు, మహిళల పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని మానవ అక్రమ రవాణా ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆడబిడ్డలను సంతలో సరుకుగా అమ్ముతున్నారు. కఠిన శిక్షలున్నా జిల్లాలో అమానవీయ ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో ఒంటరి మహిళలు, పేద కుటుంబాలకు చెందిన యువతులను పెళ్లి, డబ్బు ఎరగా చూపి ఇతర రాష్ట్రాలకు తరలించడం పరిపాటిగా మారింది. తాజాగా బెజ్జూర్‌ మండలానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులను మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్‌లో విక్రయించిన ముఠాను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నేడో, రేపో ఈ ముఠా అరెస్టును చూపి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

బెజ్జూర్‌ టు మధ్యప్రదేశ్‌..

పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అమ్మాయిలను ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. గతేడాది ఆసిఫాబాద్‌కు చెందిన ఓ ముఠా సభ్యులు మహబూబాబాద్‌ జిల్లా రేకులతండాకు చెందిన ఓ మహిళ(24)లతో పాటు ఆసిఫాబాద్‌ మండల పరిధిలోని ఓ యువతిని మధ్యప్రదేశ్‌కు విక్రయించారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసి గత జూలై 18 తేదీన వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఓ కానిస్టేబుల్‌ సైతం ఉండడం గమనార్హం. తాజాగా బెజ్జూర్‌ మండలంలోని ఇద్దరు గిరిజన యువతులను రూ.2.50 లక్షల చొప్పున మధ్యప్రదేశ్‌లో ఓ ముఠా విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలోని మహిళతో పాటు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జిల్లా నుంచి ప్రత్యేక పోలీస్‌ బృందం మధ్యప్రదేశ్‌కు వెళ్లి బాధితులను అక్రమార్కుల చెర నుంచి విడిపించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. సూత్రధారులను పట్టుకునే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రూ.2.50 లక్షల చొప్పున విక్రయం

సమాజం అభివృద్ధి చెందుతున్నా మానవ అక్రమ రవాణా సమస్య అంతం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు దళారులు ధనార్జనే లక్ష్యంగా ఒంటరి మహిళలు, పేద కుటుంబాలకు చెందిన యువతులను లక్ష్యం చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన రంగు, రూపం ఉన్న మహిళలను ఊబిలోకి దించుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన మహిళలు, యువతులు ఏటా అక్రమ రవాణాకు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నా యి. అదృశ్యమవుతున్న వారిలో కొందరి ఆ చూకీ శాశ్వతంగా దొరకకపోవడం గమనా ర్హం. బెజ్జూర్‌లోని ఇద్దరు గిరిజన అమ్మాయిలను ఒక్కొక్కరిని రూ.2.50 లక్షల చొప్పున ఓ ముఠాకు విక్రయించినట్లు సమాచారం. గతేడాది జరిగిన ఘటనల్లో ఆసిఫాబాద్‌కు చెందిన యువతిని రూ.1.30 లక్షలకు అమ్మగా.. మహబూబాబాద్‌కు చెందిన మహిళను రూ.1.10 లక్షలకు మధ్యప్రదేశ్‌లోని వ్యక్తులకు విక్రయించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు అమలు చేసి మానవ అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement