ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం జిల్లాలో రైతులకు ముగిసిన శిక్షణ తరగతులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు కెరమెరి మండలం దనోరా గ్రామానికి చెందిన కేంద్రె బాలాజీ. 2015 నుంచి పదెకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. కంది, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, అనుములతోపాటు కూరగాయలైన టమాట, చిక్కుడు, అలసంద, వంకాయ పండిస్తున్నారు. అలాగే బత్తాయి, ఆపిల్, మామిడి, బొప్పాయి సాగు చేస్తున్నారు. ఏడాదికి రూ.4 లక్షలు పెట్టుబడి పెడుతుండగా, రూ.7 లక్షల ఆదాయం వస్తోంది. సంవత్సరానికి రూ.3 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. జిల్లాలోనే సేంద్రియ పంటలు పండించిన తొలి రైతుగా ఆయన గుర్తింపు పొందారు.
కెరమెరి: అధిక దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిమితికి మించి వాడుతున్నారు. దీంతో బియ్యం, పప్పులు, నూనెగింజలు వంటి ఆహార ధాన్యాల్లో రసాయన అవశేషాలు ఉండి మనుషుల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రజలకు, పర్యావరణానికి మేలు చేస్తుందని భావించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అన్నదాతలను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’(ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పథకాన్ని అమలు చేస్తోంది.
ఒక్కో క్లస్టర్‌లో 125 మంది ఎంపిక
కేంద్ర అమలు చేస్తున్న ప్రభుత్వం జాతీయ వ్యవసా య పథకం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ – 2024లో భాగంగా జిల్లాలోని 15 మండలాలకు చెందిన సీఆర్‌పీలకు గత నెలలో నిపుణులతో శిక్షణ అందించారు. జిల్లాలో మొత్తం 70 వ్యవసాయ క్లస్ట ర్లు ఉండగా 24 క్లస్టర్లను ఇందుకోసం గుర్తించారు. ఒక్కో క్లస్టర్‌కు 125 మంది రైతులను ఎంపిక చేశా రు. సీఆర్‌పీలు ప్రస్తుతం రైతులకు సేంద్రియ వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
మట్టి నమూనాలు సేకరణ
భూసార పరీక్షల కోసం 3,000 మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. ఫలితాల ఆధారంగా భూమిని సహజ సాగుకు యోగ్యంగా మార్చాల్సి ఉంటుంది. వచ్చే యాసంగి నాటికి ప్రతీ రైతు కనీసం ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ముందుగా మహిళా సంఘాల్లోని సభ్యులను ‘కృషి సఖీ’లుగా ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా ఇతర రైతులకు అవగాహన కల్పించనున్నారు.
కెరమెరిలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన బొప్పాయి
జిల్లా వివరాలు
మొత్తం క్లస్టర్లు 70
పథకం అమలవుతున్నవి 24
సీఆర్‌పీలు 48
బీఆర్‌సీలు 16
ఒక్కో క్లస్టర్‌లో రైతులు 125
మొత్తం రైతులు 3000
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యం
భూమిలో సహజంగా ఉండే జీవవైవిధ్యాన్ని, పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు, కీటకాలను కాపాడుకునేలా సహజ సేద్యం ఉంటుంది. పశువులు, ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాగులో జీవ నియంత్రణ పద్ధతులు, వృక్ష సంబంధిత కషాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీజామృతంతో విత్తన శుద్ధి, జీవామృతంతో పురుగులను అదుపు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట మార్పిడి విధానాన్ని కచ్చితంగా పాటించాలి. దేశీ ఆవు పేడ, మూత్రం, ఇతర సహజ పదార్థాలతో ఎరువులు తయారు చేసి వినియోగించడమే ఈ పథకం లక్ష్యం. సాగు విధానం, యాజమాన్య పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందులో మట్టిలోని పోషక విలువలు కీలక భూమిక పోషిస్తాయి. రైతులు ప్రస్తుతం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలను మాత్రమే వాడుతూ, మిగతా సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా నేలకు అవసరమైన పోషకాలను సహజ పద్ధతిలో పెంపొందించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.


