పగలు ఎండ.. రాత్రి చలి | - | Sakshi
Sakshi News home page

పగలు ఎండ.. రాత్రి చలి

Feb 10 2026 7:28 AM | Updated on Feb 10 2026 7:28 AM

పగలు ఎండ.. రాత్రి చలి

పగలు ఎండ.. రాత్రి చలి

జిల్లాలో భిన్న వాతావరణం గిన్నెధరిలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కౌటాలలో 32.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు మరో వారం రోజులు ఇవే పరిస్థితులు..

దహెగాం: జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా మరోవైపు రాత్రిపూట చలి తీవ్రత సైతం కొనసాగుతోంది. ఆదివారం తిర్యాణి మండలం గిన్నెధరిలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కౌటాలలో 32.4 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు చల్లగా ఉంటూ క్రమంగా మధ్యాహ్నం వరకు ఎండ వేడి పెరుగుతోంది.

పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

వాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండగా ఉంటోంది. రాష్ట్రంలో దిగువ స్థాయిలో ఆగ్నేయ గాలులు వీచినప్పటికీ ఈశాన్య గాలులు, తూర్పు గాలులు దిగువ స్థాయిలో రావడంతో ఈ మార్పులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గాలుల తీవ్రతతో చలిలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 30 నుంచి 33 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 9 నుంచి 15 మధ్య కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి తిర్యాణి మండలం గిన్నెధరిలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలు ఉండగా, సిర్పూర్‌(యు)లో 10, కెరమెరి 11, వాంకిడి, తిర్యాణి, కెరమెరి ధనోర, బెజ్జూర్‌లో 12 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని మండలాల్లో 30 డిగ్రీలు దాటాయి. కెరమెరి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, ఆసిఫాబాద్‌, కౌటాల మండలాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చలి, ఎండతో ప్రజలు జలుబు, దగ్గుతో ఇబ్బందులు పడుతున్నారు.

యాసంగి పంటలపైనా ప్రభావం..

వాతావరణ మార్పుల ప్రభావం యాసంగి పంటలపై పడుతోంది. చలి, ఎండతో పంటల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఉండగా, మొక్కజొన్నను కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. చలి తీవ్రత నేపథ్యంలో వరి సాగు చేసే రైతులు రాత్రి నీళ్లను వదిలేసి ఉదయం మోటరు వేసి గోరువెచ్చని నీటిని అందించాలని సూచిస్తున్నారు. మరో వారం రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ప్రాంతం కనిష్ట గరిష్ట

(డిగ్రీల (డిగ్రీల

సెల్సియస్‌) సెల్సియస్‌)

గిన్నెధరి 9.7 30.9

సిర్పూర్‌(యు) 10.4 30.0

కెరమెరి 11.7 32.7

వాంకిడి 12.0 30.6

తిర్యాణి 12.4 30.6

ధనోరా 12.4 31.4

బెజ్జూర్‌ 12.7 32.1

రవీంద్రనగర్‌ 13.6 31.4

కాగజ్‌నగర్‌ 13.7 30.5

ఎల్కపల్లి 13.8 32.4

లోనవెల్లి 13.8 31.4

వంకులం 13.9 31.1

కుంచవెల్లి 14.0 31.3

ఆసిఫాబాద్‌ 14.4 32.1

కౌటాల 14.8 32.4

జైనూర్‌ 15.3 30.3

లింగాపూర్‌ 15.4 30.1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement