నిధులపై ఆశలు.. అభివృద్ధికి ఎదురుచూపులు!
పాలక వర్గాలు కొలువుదీరడంతో విడుదలకు అవకాశం పల్లెల్లో పనులు చక్కబెట్టే ప్రణాళికల్లో కొత్త సర్పంచులు
రెబ్బెన: రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పాలకవర్గాలు లేక ప్రభుత్వాలు పంచాయతీలకు నిధుల విడుదలను నిలిపివేయడంతో ఖాతాలు ఖాళీగా మారాయి. పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చుచేసి పంచాయతీలను నడిపించారు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు పూర్తికాగా.. పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సమస్యలపై దృష్టి సారించారు. ఉత్సాహంగా పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాయి. అయితే ఖాళీ ఖాతాలు వారి అడుగులకు సంకెళ్లు వేస్తున్నాయి. ప్రస్తుతానికి సొంత డబ్బులు ఖర్చు చేస్తూ చిన్న చిన్న హామీలు నెరవేస్తున్నారు.
పాలన గాడిలో పెట్టేలా..
గత నెలలో మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. జిల్లాలో 335 పంచాయతీలు ఉండగా 332 మంది సర్పంచులు, 2,833 మంది వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల క్రితం సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రత్యేకాధికారులు పాలనను గాలికొదిలేసి, సమస్యలు పట్టించుకోలేదు. ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం మల్టీపర్పస్ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించడం మినహా ఇతర పనులు ముందుకు సాగలేదు. అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులకు మరమ్మతులు లేక అడుగడుగునా గుంతలమయంగా మారాయి. తాగునీటి సరఫరాను సక్రమంగా చేపట్టేందుకు పైపులైన్ల మరమ్మతులు, గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ఇతరాత్ర పనులు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కార్యదర్శులే జేబు నుంచి ఖర్చు చేసి సమస్యలు పరిష్కరించారు. ఖాతాల్లో నిధులు లేకపోవడంతో వారికీ ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకు నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టి పల్లె పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలను గుర్తిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరించేలా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ఖర్చు తడిసిమోపెడు కాగా అప్పులు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తంటాలు పడుతున్నారు.
పంచాయతీలకు ఎస్‌డీఎఫ్ నిధులు
గ్రామాల్లో ఎన్నికల సందడి పూర్తికావడంతో పంచాయతీల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిధుల కొరతను తీర్చేందుకు పంచాయతీలకు ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేయనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో కొత్తగా పాలనపగ్గాలు చేపట్టిన సర్పంచులకు ఆదిలోనే తీపి కబురు అందింది. రాష్ట్ర నుంచి నిధులు మంజూరైతే అభివృద్ది పనులను ముందుకు తీసుకెళ్లేందుకు వీలవుతుంది. మేజర్ గ్రామాలకు రూ.10లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5లక్షల చొప్పున జనవరి మొదటి వారంలోనే అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామాలకు మళ్లీ పాతరోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. పాలక వర్గాలు కొలువుదీరడంతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల సైతం మంజూరయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు సాధారణ, ఉపాధిహామీ, పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు ద్వారా ఆదాయం సమకూరనుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిధిలోని జనాభా ఆధారంగా ఒక్కో వ్యక్తికి ఏడాదికి రూ.618 చొప్పున నిధులు విడుదల చేస్తుంది. గతంలో కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేది. అక్కడి నుంచి పంచాయతీలకు చేరేవి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీలకు నిధులను విడుదల చేస్తోంది. రెండేళ్ల కాలానికి సంబంధించి పెండింగ్ నిధులు మొత్తం పంచాయతీలకు అందనున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్‌పవర్ అధికారం ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులు బ్యాంకులు, ట్రెజరీలతో కొత్త సర్పంచులు, ఉప సర్పంచుల సంతకాలు మార్చే పనుల్లో నిమగ్నమయ్యారు.


