ఘనంగా శౌర్య దివస్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద గురువారం జైభీమ్ సేన, సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో శౌర్య దివస్, భీమ్ కోరేగావ్ ఘనంగా నిర్వహించారు. నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు హూక్టుజి దుర్గె, జైభీమ్ సేన అధ్యక్షుడు జాడె వినోద్ మాట్లాడుతూ కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరానితనం నుంచి విముక్తి పొందడానికి మహార్ కులానికి చెందిన 500 మంది సైనికులు జనవరి 1న బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పీష్వా సైన్యంతో విరోచితంగా పోరాడి విజయం సాధించారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఏటా జనవరి 1న భీమా కోరేగావ్ స్తూపాన్ని సందర్శించి నివాళులర్పించే వారని అన్నారు. కార్యక్రమంలో సుధాకర్, పెంటయ్య, అనిల్ దుర్గె, అజిత్ కట్కార్, వెంకటేశ్, మహేశ్, కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.


