ట్రాఫిక్ నియమాలు పాటించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా తొలిరోజు గురువారం అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ నియమాలపై సమీక్షించారు. ఉద్యోగులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించి పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మోటారు వాహన చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం రహదారులపై సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారి శంకర్‌నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


