నేరాల నియంత్రణకు చర్యలు
ఆసిఫాబాద్: జిల్లాలో నేరాలు నియంత్రించి, శాంతిభద్రతలు పెంపొందిస్తామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. నూతన సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో కొత్త లక్ష్యాలతో పనిచేస్తామని తెలిపారు. ప్రజల రక్షణపై దృష్టి సారిస్తామన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాల నివారణ, సైబర్ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 2026లో చేపట్టే కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
సాక్షి: గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తీసుకుంటున్నాం. గంజాయి సాగు, విక్రయాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతేడాది జిల్లాలో 73 కేసులు నమోదు చేసి, 122 మందిని అరెస్టు చేశాం. 15.224 కిలోల ఎండు గంజాయి, 1,118 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నాం.
సాక్షి: సైబర్ నేరాల నియంత్రణకు కార్యాచరణ ఏంటి?
ఎస్పీ: సైబర్ నేరాల నియంత్రణపై అన్ని మండలాల్లో కళాబృందాలతో ఈ ఏడాది ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సైబర్ మోసం జరిగిన సమయంలో గోల్డెన్ అవర్‌లో 1930కి కాల్ చేస్తే పో లీసులు స్పందిస్తారు. ఖాతాలను ఫ్రీజ్ చేస్తాం. జిల్లాలో 37 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 20 మంది నిందితులను అరెస్టు చేశాం.
సాక్షి: పోలీసు గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తులు ఎలా పరిష్కరిస్తున్నారు?
ఎస్పీ: ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా స్పందించకుంటే డీపీవోకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ దరఖాస్తు నిశితంగా పరిశీలిస్తాం. గతేడాది 232 దరఖాస్తులు రాగా, 220 పరిష్కరించాం. సోమవారం వీలుకాని పక్షంలో వేరే రోజు కూడా రావచ్చు. ఏ సమస్య ఉన్నా నేరుగా సంప్రదించాలి.
సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలను ఎలా అరికడతారు?
ఎస్పీ: జిల్లాకు ప్రత్యేక ట్రాఫిక్ వింగ్ లేదు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. పెట్రోలింగ్, వాహన తనిఖీలు చేస్తాం. కాగజ్‌నగర్‌లో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్‌ను నియమించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించాం. గతేడాది జిల్లాలో 267 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 3,757 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశాం.
సాక్షి: జిల్లాలో చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీటి అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: జిల్లాలో దొంగతనాలు నియంత్రించేందుకు ప్రతిరోజూ రాత్రి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 600 పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేశాం. బ్యాంకులు, పెట్రోల్ పంపులు, ఏటీఎం ప్రాంతాలను తనిఖీ చేస్తున్నాం.
సాక్షి: ఏటా మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. జిల్లాలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలేంటి?
ఎస్పీ: వేధింపులకు గురైతే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. షీటీంలు, కళాబృందాలతో గ్రామాలు, పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరిస్తాం. గతేడాది 106 మహిళల వేధింపుల కేసులు నమోదు చేశాం. మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి. నేరాలు జరిగితే ఎవరి వద్దకు వెళ్లాలి అనే విషయం తెలియాలి. బాధితుల కోసం ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉంచుతున్నాం.
నేరాల నియంత్రణకు చర్యలు


