
రక్తదానం అందరి బాధ్యత
ఆసిఫాబాద్‌అర్బన్: రక్తదానం అందరి బాధ్యతని, ప్రతిఒక్కరూ ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, డీఎంహెచ్‌వో సీతారాం, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ హాజరయ్యారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతీ మూడు నిమిషాలకు ఒకరికి రక్తం అవసరం పడుతుందని, మనిషి మాత్రమే రక్తదానం చేయగలడన్నారు. నాలుగురోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రంలో రక్తదాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తం సేకరించాలని నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో సీతారాం రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో రెండు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని, జైనూర్‌లో మరొకటి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, వైద్యశాఖ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.