
ఎరువుల కోసం రైతుల ఆందోళన
కాగజ్‌నగర్‌టౌన్: సరిపడా డీఏపీ, యూరియా బస్తాలు ఇవ్వడం లేదని శుక్రవారం కాగజ్‌నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగినా పీఏసీఎస్ సిబ్బంది పట్టించుకోవడం లేదని, చిట్టీలు ఉన్న వారికే ఇస్తున్నారని ఆరోపించారు. విడతల వారీగా ఎకరానికి రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. పీఏసీఎస్ సిబ్బంది ముక్తార్, సతీశ్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని రైతులను సముదాయించారు. చిట్టీలు ఉన్నవారికే ఎరువులు ఇస్తారని చెప్పడంతో రైతులు వరుసలో నిలబడి రాత్రి 8 గంటలు దాటే వరకు బస్తాలు తీసుకున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి రామకృష్ణను వివరణ కోరగా.. కాగజ్‌నగర్ మండలంలో ఖరీఫ్ సాగుకు 85 వేల బస్తాలు అవసరం కాగా ఇప్పటికే రైతులకు పీఏసీఎస్ ద్వారా 27 వేల బస్తాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా 14వేల బస్తాలు, ఇతర ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా డీఏపీ బస్తాలు అందించామని తెలిపారు. ఈ నెల 9న డీఏపీ, యూరియా బస్తాల పంపిణీ కూపన్లను పీఏసీఎస్‌లకు ఇవ్వాలని పాలకవర్గ సభ్యులు కోరడంతో అప్పగించామన్నారు. రైతులు నానో యూరియా వాడాలని సూచించారు. సరిపడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు.