
రెండోరోజూ నిరవధిక నిరాహారదీక్ష
కాగజ్‌నగర్‌టౌన్: పోడు భూముల సమస్యకు పరిష్కారం, జీవో 49 రద్దు కోసం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సోమవారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజూ మంగళవారం కూడా కొనసాగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మే 30న తడోబా రిజర్వ్ ఫారెస్ట్‌ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కలుపుతూ కుమురం భీం జిల్లాలోని 334 గ్రామాలను రిజర్వు ఫారెస్ట్‌గా పేర్కొంటూ అక్రమంగా తీసుకువచ్చిన జీవో నం.49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దిందా పోడు రైతులను రవీంద్రనగర్‌లోని కర్జెల్లి ఫారెస్ట్ కార్యాలయానికి పిలిపించి బెదిరింపులకు పాల్పడడం దారుణమని, దీనిని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లో పోడు భూముల సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి, ప్రభుత్వం నుంచి జీవో 49 రద్దు చేస్తామనే ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, రెండోరోజు వైద్యులు ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు చేశారు. దీక్షకు సంఘీభావంగా సిర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్, చింతలమానెపల్లి మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
శాసనసభ స్పీకర్‌కు లేఖ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జీవో 49 శాశ్వతంగా రద్దు చేయాలని, పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఎమ్మెల్యే హరీశ్‌బాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 49 కుమురం భీం జిల్లాలో చిచ్చురేపుతుందన్నారు. పోడు రైతులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు హైదరాబాద్‌కు కాలినడకన వెళ్తుండగా వారిని అరెస్టు చేసి సొంత గ్రామాలకు తరలించారని తెలిపారు. కాగజ్‌నగర్ అటవీ కార్యాలయం ముట్టడికి శాంతియుతంగా పిలుపునిస్తే ప్రభుత్వం అనుమతివ్వకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారని ఆరోపించారు.

రెండోరోజూ నిరవధిక నిరాహారదీక్ష