
‘మినరల్’ దందా
జిల్లాలో అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్ల నిర్వహణ వర్షాకాలంలో అపరిశుభ్రమైన తాగునీటి సరఫరా ప్రజల ప్రాణాలతో చెలగాటం
బెజ్జూర్(సిర్పూర్): ప్రభుత్వం నుంచి సరైన అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ.. మినరల్ వాటర్ పేరిట కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్యూరిఫైడ్ నీళ్ల పేరిట నిర్వాహకులు ఏటా రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు కలుషిత నీటిని అందిస్తున్నారు. కేవలం ఒక ట్యాంక్, మరో రెండు బా యిలర్ మాదిరి ట్యాంకులు.. అన్నింటినీ అనుసంధానిస్తూ పైప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో పట్టణాలకు పరిమితమైన మినరల్ వాటర్ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. క్యాన్‌కు రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్లను శుద్ధి చేయడానికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది.
500లకు పైగా ప్లాంట్లు
జిల్లాలో ప్రస్తుతం 500 పైగా ప్లాంట్లు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసి కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాలు శుద్ధి చేయకపోవడం, జలాన్ని శుద్ధి చేయకుండా సాధారణ నీటినే క్యాన్లలో సరఫరా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని పలువురు ఇళ్లతోపాటు దుకాణాలు, పాత గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. కనీసం నీటి నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో నిబంధనలు పాటించని 30 వాటర్ ప్లాంట్లకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఐఎస్‌ఐ సర్టిఫికెట్లు కొన్నింటికి ఉన్నా ఏటా రెన్యువల్ చేసుకోవడం లేదు.
నిబంధనలపై పట్టింపేది..?
వాటర్ ప్లాంట్‌లో మైక్రోబయాలజిస్ట్, కెమిస్ట్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉంటూ పీహెచ్ విలువ 7 కంటే తగ్గకుండా చూసుకోవాలి. పీహెచ్ స్థాయిలో హెచ్చుతగ్గులు కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. ప్రతీ క్యాన్‌పై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ కూడా వేయాలి. ప్లాంట్ నిర్వహణకు బీఎస్‌ఐ అనుమతి తీసుకోవడంతో పాటు ఐఎస్‌ఐ నిబంధనలు పాటించాలి. ప్రతీ మూడు నెలలకోసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. కానీ పై నిబంధనలేవీ జిల్లాలోని ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. ఈ విషయంపై ‘సాక్షి’ భూగర్భజల శాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారి కె.సుహాసినిని వివరణ కోరగా.. ఇప్పటివరకు జిల్లాలోని 30 వాటర్ ప్లాంట్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కెరమెరి, జైనూర్, లింగాపూర్ తదితర ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందించామని పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
మినరల్ వాటర్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్యాన్లు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వర్షాకాలంలో వాగు, చెలిమె నీళ్లు తాగొద్దు. – సీతారాంనాయక్, డీఎంహెచ్‌వో