
‘దిందా’ రైతులతో
ఎమ్మెల్సీ, అధికారుల చర్చలు
చింతలమానెపల్లి(సిర్పూర్): చింతలమానెపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పోడు భూముల రైతులతో సోమవారం ఎమ్మెల్సీ దండె విఠల్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్ బొగాడే చర్చలు జరిపారు. ఖర్జెల్లి అటవీ రేంజ్ అధికారి కార్యాలయంలో పోడు రైతులతో సమావేశమయ్యారు. దిందా రైతులకు ఎఫ్‌డీవో అటవీ చట్టాల గురించి వివరించారు. ఒక్కో రైతుకు ఎంత భూమి ఇవ్వాలనే విషయంపై అంగీకారానికి రావాలని సూచించారు. రైతులు మాట్లాడుతూ తమకు గతంలో ఇస్తానని ప్రకటించిన భూమికి తోడు అదనంగా మరో 250 ఎకరాలు ఇవ్వాలని కోరారు. గ్రామంలో 330 రేషన్ కార్డులు ఉండగా, మరో 20 కుటుంబాలకు లేవని తెలిపారు. మొత్తం 350 కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరారు. ఐదెకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు యథాస్థితిని కొనసాగించాలని, ఎక్కువ ఉన్న రైతులకు మాత్రం ఐదెకరాలు ఇచ్చి మిగతా భూమిని తీసుకునేందుకు అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఎఫ్‌డీవో మాట్లాడుతూ రైతులకు నిబంధనల మేరకు మూడెకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతులు తెలిపిన వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని అటవీ అధికారులకు సూచించారు. నాలుగెకరాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎఫ్‌ఆర్‌వో సుభాష్, కౌటాల సీఐ సంతోష్, జెడ్పీ మాజీ చైర్మన్ గణపతి తదితరులు పాల్గొన్నారు.