
అభివృద్ధి
ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు ఆహార భద్రతకు రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా స్వాతంత్య్ర సంబురాలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ఆకాంక్షలకు అనుగుణంగా
మాట్లాడుతున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
ఆసిఫాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతుందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర సంబురాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్ బాబు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన బండ ప్రకాశ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రగతిని చదివి వినిపించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. 70 ఏళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తుందని, అదే స్ఫూర్తితో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
రైతు రుణమాఫీ
గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీ పథకం ప్రారంభించి రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసినట్లు తెలి పారు. ఇందిరమ్మ రైతుభరోసా కింద ఎకరాకు రూ. 12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామన్నారు. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. రైతుబీమా పథకం కింద 501 మంది రైతుల నామినీలకు రూ.5 లక్షల చొప్పున రూ.25.05 కోట్లు ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
తొలివిడతగా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేశామని, ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇందుకోసం రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఈ ఏడాది మార్చి 17న శాసన సభలో ఆమోదించామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాలో 11,997 మంది పేదలు వైద్య చికిత్స పొందారన్నారు. గృహజ్యోతి కింద జిల్లాలోని 72,817 కుటుంబాలకు రూ.31.58 కోట్లు రాయితీ కల్పించామని తెలిపారు.
సోలార్ పవర్ ప్లాంట్ కోసం స్థలం గుర్తింపు
ఇందిర మహిళా శక్తి పథకం కింద రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని 4 గ్రామ సంఘాల పరిధిలో ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిని సోలార్ పవర్ ప్లాంట్ కోసం గుర్తించి ప్రభుత్వం నుంచి రూ.40 లక్షలు మంజూరు చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 914 స్వయం సహాయక సంఘాలకు రూ.58.11 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని 727 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
భూ సమస్యల పరిష్కారానికి ‘భూభారతి’
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ఈ ఏడా ది ఏప్రిల్ 14న భూభారతి నూతన చట్టాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 356 దరఖాస్తులు రాగా, 148 పరిష్కరించామన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 35 లక్షల మొక్కలు నాటామన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 51 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 62 శాతంతో 31 లక్షలు నాటడం పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. ఎకో టూరిజం కింద గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.
61 వేల కుటుంబాలకు ‘ఉపాధి’ పనిదినాలు
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా 2025– 26 ఆర్థిక సంవత్సరంలో 61 వేల కుటుంబాలకు రూ.21.14 వేల పని దినాల పని కల్పించామన్నారు. కూలీలకు రూ.48.53 కోట్లు చెల్లించడంతో పాటు మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.10.58 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. జిల్లాలోని 973 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 8,568 మంది గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నామన్నారు. ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద 450 మంది దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలు అందించామని వె ల్లడించారు. రాష్ట్రంలోని మూడు ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఒకటైన కుమురంభీం ఆసిఫాబాద్‌లో ఇందిరమ్మ అమృత పథకం కింద 14 నుంచి 18 ఏళ్లు గల 18,230 మంది కౌమర బాలికలకు పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 74 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 2,950 మంది సభ్యులు ఉండగా 2024– 25 సంవత్సరానికి 47.38 లక్షల ఉచిత చేపపిల్లలు సరఫరా చేసినట్లు తెలిపారు. 2025– 26 సంవత్సరానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 188 మంది విద్యార్థులకు రూ.6.25 లక్షలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా 1,297 మంది విద్యార్థులకు రూ.2.28 లక్షలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 279 మందికి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కింద రూ.4.92 కోట్లు ఉపకార వేతనాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాను ప్రగతిపథకంలో నడిపించి, అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకిత భావంతో పనిచేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
భరతమాత వేషధారణలో విద్యార్థిని
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నృత్యాలతో అలరించారు. వాంకిడి కస్తూరిబా గాంధీ విద్యాలయం బాలికలు విన్యాసాలు చేశారు. గిరిజన బాలికల కళాశాల విద్యార్థినులు ‘ఇదే మా భారతం ’ అనే పాటకు డ్యాన్స్ చేశారు. బాలికల ఉన్నత పాఠశాల, ఆదర్శక్రీడా పాఠశాల, ఇతర ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గోండి పాటలకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, డీపీవో భిక్షపతి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి

అభివృద్ధి

అభివృద్ధి

అభివృద్ధి

అభివృద్ధి

అభివృద్ధి