
ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి
దహెగాం: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక ప్రాంతాల్లో పత్తి, వరి పంటలు వరదతో పూర్తిగా కొట్టుకుపోయాయని, ప్రభుత్వం సర్వే నిర్వహించి ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం అందించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. దహెగాం మండలం గిరవెల్లి, కర్జి తదితర గ్రామాల్లో వరదలతో దెబ్బతిన్న పత్తి పంటను శుక్రవారం నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెద్దవాగు, ఎర్రవాగులు ఉప్పొంగడంతో వరదతో పత్తి నీట మునిగిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్ స్పందించి సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని కోరారు. కర్జి చెరువు మత్తడి తెగి ఐదేళ్లవుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరంతా వృథాగా పోతుందన్నారు. దహెగాం మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్లు సక్రమంగా లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేరకపోవడంతో లోహా గ్రామానికి చెందిన మడే రమాదేవి పాముకాటుకు గురై మృతి చెందిందని తెలిపారు. ఆయన వెంట నాయకులు లెండుగురే శ్యాంరావ్, దందెర మల్లేశ్, మనోహర్, అంజన్న తదితరులు ఉన్నారు.