
గోల్కొండ పరేడ్‌లో ఏఎస్పీ చిత్తరంజన్
ఆసిఫాబాద్: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన పరేడ్‌కు ఆసిఫాబాద్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చిత్తరంజన్ నేతృత్వం వహించారు. తెలంగాణ కేడర్ 2022 బ్యాచ్‌కు చెందిన చిత్తరంజన్ గతేడాది సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌కు కూడా కమాండర్‌గా వ్యవహరించి.. నాయకత్వం, డ్రిల్ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ ఏఎస్పీగా పనిచేస్తూ ప్రజా కేంద్రిత పోలీసింగ్ విధానం, జిల్లా ఉప విభాగంలోని గిరిజన యువతతో సన్నిహిత సంబంధాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నారు. తిర్యాణి పాత పోలీస్ స్టేషన్‌ను ప్రజా గ్రంథాలయంగా, పాత వాంకిడి పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని ఆటస్థలంగా మార్చారు. పశువుల అక్రమ రవాణా, అక్రమ వడ్డీ వ్యాపారం, నిషేధిత గంజాయి సాగు రవాణా, వ్యాపారం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అటవీ పరిసర గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించేందుకు దీర్ఘకాలిక ప్రచారాలు చేపట్టారు.