
ఉప్పొంగిన ‘దిందా’.. వృద్ధురాలి వేతన
చింతలమానెపల్లి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. చింతలమానెపల్లి మండలంలోని దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న జాడి లలితకు మూడు రోజులుగా వైద్యం అందడం లేదు. లలిత ముగ్గురు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పెద్ద కుమారుడు వినోద్, చిన్న కుమారుడు సోను మంచిర్యాలలోని ఒక హోటల్‌లో పని చేస్తుండగా, రెండో కుమారుడు మహారాష్ట్రలో కూలీ పని చేస్తున్నాడు. భర్త బక్కయ్య 15 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంటి వద్ద లలిత ఒక్కరే ఉంటుంది. ఈ క్రమంలో మూడు రోజులుగా జ్వరం, రక్తపోటు సమస్యతో అనారోగ్యానికి గురై మంచాన పడింది. ఆరోగ్య ఉపకేంద్రం వారానికి ఒక్కసారి మా త్రమే తెరుస్తారని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు కుమారులకు సమాచారం ఇచ్చారు. చిన్న కుమారుడు సోను తల్లిని తీసుకెళ్లేందుకు రాగా దిందా వాగు కారణంగా గ్రామానికి చేరుకోలేకపోయాడు. వాగుకు అవతలి వైపే ఆగిపోయాడు. గ్రామస్తులు మానవతా ధృక్పథంతో అంబలి పోస్తున్నారు.