
న్యాయవాదిపై తప్పుడు కేసు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది పూదరి నరహరిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, నరహరిపై అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. అనంతరం ర్యాలీగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కు వినతిపత్రం అందించారు. న్యాయవాదులు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు పాటించకుండా నరహరిపై తప్పుడు కేసు నమోదు చేసిన రెబ్బెన ఎస్సైని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ముక్త సురేశ్, రజి హైదర్, బోనగిరి సతీశ్‌బాబు, రాపర్తి రవీందర్, ఎస్.శ్రీనివాస్, ఆసిఫాబాద్, సిర్పూర్, గోదావరిఖని బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.