
సస్పెన్షనే..!
ఫేక్ హాజరు వేస్తే
● కార్యదర్శులపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం ● తప్పనిసరిగా పంచాయతీ పరిధిలో అటెండెన్స్ వేయాల్సిందే..
దహెగాం(సిర్పూర్): ఇటీవల రాష్ట్రంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఫేక్ హాజరు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విధులకు రాకున్నా ఫేక్ హాజరు వేసే కార్యదర్శులపై చర్యలకు తీసుకోనుంది. నకిలీ ముఖ గుర్తింపు హాజరు వేసేవారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు అవసరమైతే సస్పెన్షన్ వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది. కాగా జిల్లాలో కొందరు కార్యదర్శులు యాప్‌లో ఫేక్ హాజరు వేసినట్లు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
జీపీ మానిటరింగ్ యాప్‌లో..
జీపీ మానిటరింగ్ యాప్‌ను కార్యదర్శులు తమ మొబైల్‌లో ఓపెన్ చేసి డీఎస్‌ఆర్(డిస్ట్రిక్ శానిటేషన్ రిపోర్ట్)లో పంచాయతీ పరిధిలో ఉండి ఉదయం 11 గంటలలోపు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే పలువురు కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. విధులకు హాజరు కాకుండా సొంత పనులకు వెళ్తూ ఫేక్ హాజరు వేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ వద్దకు అధికారులు ఫైల్ పంపినట్లు తెలిసింది. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో కార్యదర్శులు లేకపోవడంతో కొందరికి అదనంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో కార్యదర్శులు రెండు పంచాయతీల్లో ముఖ గుర్తింపు హాజరు వేయకుండా రెగ్యులర్ పోస్టింగ్ ఉన్నచోట మాత్రమే వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌చార్జిగా ఉన్న పంచాయతీల్లో కారోబార్‌లతో వేయిస్తున్నారు. ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఫేక్ హాజరు వేస్తే అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలో ఫేక్ హాజరు వేసిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించగా, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలి సింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఏడాదిన్నరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో పంచాయతీల నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యదర్శులు వాపోతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీరు తదితర అవసరాలకు అప్పులు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుండా విధుల్లో వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు ఫేక్ హాజరు వేసినట్లు తమ దృష్టికి రాలేదు. నిబంధనలు ఉల్లంఘించి ఫేక్ హాజరు వేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వర్తించాలి. ప్రతీ రోజు ఉదయం 11 గంటలలోగా పంచాయతీ పరిధిలో హాజరు వేసుకోవాలి.
– భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి
335 గ్రామ పంచాయతీలు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో రెగ్యులర్ కార్యదర్శులు 258 మంది పనిచేస్తుండగా, ఔట్‌సోర్సింగ్ విధానంలో 52 మంది మొత్తం 310 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. పల్లెల్లో పాలన సజావుగా సాగడంతోపాటు జవాబుదారీతనం కోసం ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శులు విధులకు సక్రమంగా హాజరు కావాలనే ఉద్దేశంతో జూన్ 1 నుంచి ఫేస్ రికగ్నిషన్(ముఖ గుర్తింపు) హాజరు అమలు చేస్తోంది. ఈ ముఖ గుర్తింపు హాజరుపై మొదట్లో పంచాయతీ కార్యదర్శులు విముఖత వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రస్థాయిలో చర్చలు జరిగిన అనంతరం జూన్ 12 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు.