
అన్నదాతకు ‘సంకటహరణ’
● నానో ఎరువులు ప్రోత్సహించేలా ఇఫ్కో చర్యలు ● ఎరువుల కొనుగోలుతో ఉచిత బీమా ● రైతులందరికీ ప్రయోజనం
దండేపల్లి: అన్నదాతకు ఎవుసం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లప్రభావంతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు చేతికి వచ్చిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ఎరువులు, కూలీల ధరలు పెరుగుతున్నంతగా పంటల మద్దతు ధర దక్కడం లేదు. అయినా రైతుకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. బోనస్ చెల్లిస్తున్నా యి. పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో) తన నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహించేందుకు రైతులకు ఉచిత బీమా కల్పిస్తోంది. ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ‘సంకటహరణ’ ప్రమాద బీ మా పథకాన్ని ఉచితంగా అందిస్తోంది. ఈ పథకం కింద రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవస రం లేదు. కేవలం ఇఫ్కో ఎరువులను కొనుగోలు చేయడం ద్వారా బీమా పొందవచ్చు. ప్రమాదవశా త్తు మరణం లేదా అంగవైకల్యం సంభవించినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు ఇఫ్కో ప్రతి నిధులు, వ్యవసాయాధికారులు నానో యూరియా ఫ్లస్, నానో డీఏపీ ఎరువుల వాడకంతోపాటు సంకటహరణ బీమా పథకం గురించి వివరిస్తున్నారు.
కొనుగోలు సమయంలో జాగ్రత్తలు..
ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు రశీదుపై కొనుగోలు తేదీ, కొనుగోలుదారుని పేరు, తండ్రి లే దా భర్త పేరు, చిరునామా, కొనుగోలు చేసిన ఇఫ్కో ఎరువుల సంఖ్య, నామినీ పేరు, కొనుగోలు దారు ని సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు బీమా పరి హారం పొందడానికి అసలు రశీదు తప్పనిసరి. దీంతోపాటు విక్రయాల రిజిస్టర్ జిరాక్స్, పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ, డాక్టర్ చికిత్స నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఈ క్లెయిమ్ పత్రాలు ప్రమా దం జరిగిన తేదీ నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్‌లోని ఇఫ్కో బీమా కంపెనీకి పంపించాలి.
ఉమ్మడి జిల్లాలో రైతులు, సాగు విస్తీర్ణం, వినియోగించే ఎరువుల వివరాలు..
జిల్లా రైతుల సంఖ్య సాగు విస్తీర్ణం యూరియా డీఏపీ
(ఎకరాల్లో..) (మెట్రిక్ టన్నుల్లో) (మెట్రిక్ టన్నుల్లో)
మంచిర్యాల 1.64 లక్షలు 3.31 లక్షలు 43 వేలు 13 వేలు
నిర్మల్ 1.90 లక్షలు 4.40 లక్షలు 35 వేలు 10 వేలు
ఆసిఫాబాద్ 1.32 లక్షలు 4.45 లక్షలు 60 వేలు 12 వేలు
ఆదిలాబాద్ 1.65 లక్షలు 5.85 లక్షలు 35 వేలు 13 వేలు
రైతులకు ప్రయోజనకరం
సహకార సంఘాల ద్వారా ఇప్కో సంస్థ నానో యూరియా ప్లస్, నానో డీఏపీలను రైతులకు విక్రయిస్తుంది. వీటి ద్వారా రైతులకు ఎన్నో లాభాలున్నాయి. పైగా ఎరువులు కొనుగోలు చేసే రైతులకు ఆసంస్థ ఉచిత ప్రమాద బీమా అందిస్తోంది. ఇది రైతులందరికీ ప్రయోజనకరం. సద్వినియోగం చేసుకోవాలి.
– అంజిత్‌కుమార్, ఏవో, దండేపల్లి
బీమా అర్హతలు..
సహకార సంఘాల ద్వారా రైతులు ఇఫ్కో సంస్థ అందించే నానోప్లస్ యూరియా, నానో డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవచ్చు. వయో పరి మితి లేకుండా ప్రతీ రైతుకు బీమా వర్తిస్తుంది. ప్రతీ నానో ఎరువు బాటిల్ కొనుగోలుపై రూ. 10 వేల బీమా కవరేజ్ లభిస్తుంది, గరిష్టంగా రూ.2 లక్షల వరకు బీమా పరిమితి ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే 100% పరిహా రం, రెండు అవయవాలు కోల్పోతే 50%, ఒక అవయవం కోల్పోతే 25% పరిహారం అందుతుంది. ఈ బీమా ఎరువులు కొనుగోలు చేసిననాటి నుంచి 12 నెలలు చెల్లుబాటు అవుతుంది.