
లాభాల లెక్క తేలేదెన్నడో?
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల లెక్క తేల్చకుండా నానుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా లాభాలు ప్రకటించకపోవడంపై కా ర్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోగా, 69.01 మిలియన్ టన్నులు సాధించింది. ఏప్రిల్ 1, 2025న లెక్కలను సమీక్షించిన యాజమాన్యం నాలుగు నెలలు గడిచినా లాభాల వివరాలను వెల్లడించలేదు.
వాటా కోసం కార్మిక సంఘాల డిమాండ్..
సింగరేణి లాభాలను ప్రకటించిన తర్వాత, ఆ లాభాల్లో నిర్దిష్ట శాతాన్ని కార్మికులకు వాటాగా చెల్లించడం ఆనవాయితీ. కానీ లాభాల ప్రకటనలో జాప్యం కారణంగా కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరం లాభాలు ప్రకటించిన తర్వాత, కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి లాభాల వాటా ప్రకటించాలని కోరుతున్నారు. ఈసారి కూడా లాభాల ప్రకటన ఆలస్యం కావడంతో కార్మికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఉత్పత్తి లక్ష్యాలు, లాభాల లెక్కింపు
సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు, క్రయవిక్రయాలు ఆర్థిక సంవత్సరం ఆధారంగా జరుగుతాయి. ఈ లెక్కల ఆధారంగానే లాభాలను నిర్ధారిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల లక్ష్యంలో 69.01 మిలియన్ టన్నులు సాధించినప్పటికీ, లాభాల వివరాలు బయటకు రాకపోవడం కార్మికులను కలవరపెడుతోంది. ‘‘ఈసారైనా త్వరగా లాభాలు ప్రకటిస్తారని ఆశించాం, కానీ ఇంకా ఎలాంటి సమాచారం లేదు’’ అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాల ప్రకటన జాప్యంతో కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీ లాభాలను త్వరగా ప్రకటించి, కార్మికులకు వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నాయి.
లాభాలు ప్రకటించాలి
కంపెనీ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలి. అందులో కార్మికులకు వాటా చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే లాభాలు ప్రకటించకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదు. వాటా డబ్బులు సమయానికి చెల్లిస్తే పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు పనికొస్తాయి. – ఎస్‌కే.బాజీసైదా,
ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి
35 శాతం వాటా చెల్లించాలి
ఈసారి బొగ్గు ఉత్పత్తి పెరిగినందున లాభా ల వాటా కూడా పెంచి ఇవ్వా లి. లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినా లాభాలను ప్రకటించకపోవడం గుర్తింపు సంఘం వైఫల్యమే.
– వి.అనిల్‌రెడ్డి, హెచ్‌ఎమ్మెస్ బ్రాంచీ ఉపాధ్యక్షుడు
ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు దాటినా తేల్చని సింగరేణి
లాభాల్లో వాటా కోసం కార్మికుల ఎదురు చూపు
యాజమాన్యం తీరుపై అసంతృప్తి

లాభాల లెక్క తేలేదెన్నడో?

లాభాల లెక్క తేలేదెన్నడో?