
వన్యప్రాణుల రాకపోకలకు వీలుగా అండర్‌పాస్‌లు
రెబ్బెన/సిర్పూర్(టి): వన్యప్రాణులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు వీలుగా అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టాలని నేషనల్ టైగర్ కన్జర్వేటర్ అథారిటీ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్టు హరిణి అన్నారు. రెబ్బెన రేంజ్ పరిధిలోని గోలేటి సెక్షన్, అమీన్‌గూడ బీట్‌లోని కంపాట్‌మెంట్ నంబర్ 300/1లో వన్యప్రాణులు, పులుల రాకపోకల కోసం రైల్వేలైన్ అండర్‌పాస్‌లు, సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలో రైల్వే బ్రిడ్జి ప్రాంతాలను గురువారం పరిశీలించారు. సైంటిస్ట్ డాక్టర్ ఉజ్వల్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ టిబ్రేవాల్‌తో కలిసి అండర్‌పాస్‌ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాలో పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం పెరిగిందని, మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి జిల్లాకు పెద్దపులులు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. రెబ్బెన రేంజ్ పరిధిలోని రైల్వే, జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అండర్‌పాస్‌ల ద్వారా వన్యప్రాణులు కుమురంభీం జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాకు రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. అనంతరం ఇటిక్యాల పహాడ్ ప్లాంటేషన్ సందర్శించి టైగర్ ట్రాకింగ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎఫ్‌డీవో సుశాంత్ బొబడే, ఎఫ్‌ఆర్‌వోలు భానేష్, పూర్ణచందర్, ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ ఆర్వో చంద్రమోహన్, ఎఫ్‌ఎస్‌వోలు మోహన్‌రావు, ఎఫ్‌బీవోలు రాజేశం, వెంకటేశ్, నరేశ్, రవీనా, అరవింద్, రైల్వే, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.