
● అక్రమార్కుల నుంచి వసూళ్లు.. ● స్మగ్లర్లకు సహకరిస్తున్
కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని ఓ కీలక పోలీసు స్టేషన్‌లో పరిధిలో ఆవులను అక్రమంగా తరలించే వ్యక్తుల నుంచి పోలీసు అధికారికి నెలకు రూ.9 లక్షల వరకు ముడుపులు అందుతుందనే ఆరోపణలున్నాయి. కేసుల చూపించేందుకు ఒక్కోసారి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే కంకర రవాణా చేసే వ్యక్తుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారిపైనా తీవ్ర ఆరోపణలున్నాయి. బెల్ట్ దుకాణాలు నడిపే వ్యక్తుల నుంచి నెలనెలా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమార్కులు సైతం అడిగినంత ఇచ్చుకుంటూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో పోలీసుల జరిపిన దాడుల్లో కొందరు వ్యాపారులు పట్టుపడ్డారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.25 వేలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
సాక్షి, ఆసిఫాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది గాడి తప్పుతున్నారు. ప్రధానంగా జిల్లా యంత్రాంగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో మాదిరిగానే పలువురు తమ వ్యవహార శైలిని కొనసాగిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. కీలకమైన శాంతి భద్రతల వ్యవహారాన్ని కొందరు పోలీసులు వదిలేసి అవినీతిలో మునిగితేలుతున్నారు. కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని ఓ సరిహద్దు మండలం నుంచి ఆవులను అక్రమ రవాణా చేసే వ్యాపారుల నుంచి అధికారులు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా కేంద్రం, దానికి అనుకునే ఉన్న స్టేషన్లలోనూ పలువురు సిబ్బంది ఇసుక అక్రమార్కుల నుంచి రోజూ రూ.వేలల్లో తీసుకుంటున్నారు. భూ వివాదాలు తలెత్తుతున్న సందర్భాల్లో సెటిల్‌మెంట్లు చేసి ఇరువర్గాల నుంచి దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కొరవడిన విజిబుల్ పోలీసింగ్?
జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ తక్కువైంది. జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో సాయంత్రం, రాత్రిళ్లు ట్రాఫిక్ చలానాలు విధించడంపై చూపిన శ్రద్ధ, ఇసుక, ఆవుల అక్రమ రవాణా, జూదం కట్టడిపై ప్రదర్శించడం లేదు. అడపా దడపా రహదారులపై మకాం వేసి ఇసుక, ఆవులను అక్రమంగాా తరలించే వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జూదం, ఇసుక, ఆవులను తరలించే అంశాలపై ఇన్‌ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలియదని అనుకుంటే జూదం ఆడే వ్యక్తులు, ఇసుక, ఆవులను తరలించే వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా పోలీసు బాస్ ఇలాంటి అవినీతికి పాల్పడే అధికారులపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) ద్వారా నిఘా పెడితే వారి దందాలకు అడ్డుకట్ట పడుతుంది. స్టేషన్లలో లంచాల పర్వమూ తగ్గుతుంది. ఉన్నతాధికారులకు చెడ్డపేరు రాదు. తద్వారా ప్రజలకూ ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది.