ఇక అన్నీ ప్రధాన కేంద్రాలే..
● మినీ అంగన్‌వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్ ● మెయిన్ సెంటర్లుగా మార్పు ● జిల్లాలో పెరగనున్న ఆయాల పోస్టులు ● పీఎం జన్‌మన్ కింద పీవీటీజీ గ్రామాల్లో మరో 38 కేంద్రాలు
వాంకిడి(ఆసిఫాబాద్): చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యనందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసింది. అందులో పనిచేస్తున్న వారి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మేజర్ అంగన్‌వా డీ కేంద్రాలుగా గుర్తించాలని గత కొన్నేళ్లుగా ఆందో ళనలు చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇవ్వడంతో మినీ అంగన్‌వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మినీ సెంటర్లలోని టీచర్లకు రూ.7500 వేతనం చెల్లిస్తుండగా ఇకపై ప్రధాన కేంద్రాల్లోని టీచర్లకు చెల్లిస్తున్న విధంగా రూ.13,650 చొప్పున అందించనున్నారు.
139 కేంద్రాలు అప్‌గ్రేడ్
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), జైనూర్, వాంకిడి మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 139 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. గతంలో చిన్న కేంద్రాల్లో కేవలం టీచర్లను మాత్రమే నియమించారు. ఆయాలు లేకపోవడంతో టీచర్లే అన్ని పనులు చూసుకునేవారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించడంతోపాటు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేసి పెట్ట డం, రోజూవారీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, రిజిస్టర్లు నమోదు చేయడం తదితర పనులు వారికి భారంగా ఉండేవి. గ్రామంలోని ఇళ్లకు తిరుగుతూ పౌష్టికాహారం, తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా గుర్తించాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి జిల్లాలోని 139 మినీ కేంద్రాలు అప్‌గ్రేడ్ చేసింది. మేజర్ అంగన్‌వాడీలుగా మారడంతో ఆయాల పోస్టులు సైతం పెరగనున్నాయి. ప్రస్తుతం 126 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 397 ఆయా పోస్టులు ఖాళీ ఉండగా.. మరో 139 పోస్టులు అవసరం కానున్నాయి. ఇకపై అన్ని కేంద్రాలను ఒకే కేటగిరీలో గుర్తించనుండటంతో మినీ కేంద్రాల టీచర్లు సైతం రూ.13,650 వేతనం అందుకోనున్నారు.
అద్దె భవనాల్లో నిర్వహణ
జిల్లాలోని అనేక కేంద్రాలు అద్దె, రెంట్ ఫ్రీ(స్కూల్ బిల్డింగ్స్)ల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణం, మౌలిక సదుపాలయాల కల్పనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. 352 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 326 కేంద్రాలు పాత స్కూల్ భవనాల్లో నిర్వహిస్తున్నారు. 296 కేంద్రాలకు ఎలాంటి భవనాలు అందుబాటులో లేకపోవడంతో అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.
కొత్తగా 38 కేంద్రాలు
పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని పీవీటీజీ గ్రామాల్లో 38 అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత గ్రామాల్లో భవనాల నిర్మాణం చేపట్టేందుకు స్థలాలు గుర్తించాల్సి ఉంది. తదనంతరం ప్రత్యేక నిధులను కేటాయించి టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో పారదర్శకతతో పాటు అవినీతికి తావులేకుండా ప్రతీ టీచర్‌కు రూ. 20 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఉత్తర్వులు రాలేదు.
పోరాట ఫలితంగానే..
ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం గుర్తించి జీతాలు పెంచింది. భవిష్యత్తులో వీళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
– బోగె ఉపేందర్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
139 కేంద్రాలకు ప్రయోజనం
జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 139 మినీ సెంటర్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మినీ కేంద్రాలను అప్‌గ్రెడ్ చేయడంతో అన్నీ మేజర్ కేంద్రాలుగా మారాయి. వారికి వేతనాలు పెరగడంతో పాటు హెల్పర్ల సదుపాయం కలుగనుంది. జిల్లాలో 139 కేంద్రాలకు ప్రయోజనం చేకూరుతుంది.
– భాస్కర్, ఐసీడీఎస్ పీడీ
ఇక అన్నీ ప్రధాన కేంద్రాలే..
ఇక అన్నీ ప్రధాన కేంద్రాలే..


