మండుటెండల్లో జాగ్రత్తలే రక్ష | - | Sakshi
Sakshi News home page

మండుటెండల్లో జాగ్రత్తలే రక్ష

Apr 25 2025 8:28 AM | Updated on Apr 25 2025 8:30 AM

● కార్మికులు, కూలీలు, ప్రజలకు అందుబాటులో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ● వడదెబ్బ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో సీతారాం

కౌటాల: జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు పట్టణాలు, పల్లెల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 15 మండలాలు అలర్ట్‌ జోన్‌లో ఉండగా.. తిర్యాణి మండలం వార్నింగ్‌ జోన్‌కు సమీపంలో ఉంది. ఎండల్లో రక్షణ చర్యలు తీసుకోకుండా తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కెరమెరి మండలం జోడేఘాట్‌లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీ(కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్‌) కనక కాశీరాం(41) బుధవారం వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు మండుటెండల్లో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) సీతారాం సూచించారు. ఉదయం, సాయంత్రం మాత్రమే బయటికి వెళ్లి పనులు చేసుకోవాలని సూచించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురువారం ‘సాక్షి’కి వివరించారు.

వేసవిలో ఆరోగ్య రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

డీఎంహెచ్‌వో : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగా యి. ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల మధ్య ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉపాధిహామీ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలో తిరగాల్సి వస్తే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌, లేదా ఇంట్లో నిమ్మరసం, ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. సీజనల్‌గా లభించే పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, బత్తాయి, ద్రాక్ష, పైనాపిల్‌ వంటి పండ్ల రసాలు, అంబలి, మజ్జిగ తాగాలి.

వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..?

డీఎంహెచ్‌వో: వడదెబ్బ ఎవరికైనా తగలవచ్చు. శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అధిక ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. తల తిరగడం, వాంతులు, విరేచనాలు, దాహంగా ఉండడం, శ్వాసక్రియ పెరుగుదల, చెమటలు రాకపోవడం, కడుపు నొప్పి, బీపీ తగ్గడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ గురైనట్లు గుర్తించాలి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించాలి.

వేసవిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక ఏంటి..?

డీఎంహెచ్‌వో: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వడదెబ్బపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అత్యవసర పనిపై వెళ్తే తలకు టోపీలు, తెల్లని రుమాలు ధరించి, శుద్ధమైన తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశవర్కర్ల వద్ద, ఉపాధిహామీ, ఆర్టీసీ డిపోల్లో కార్మికుల కోసం 55 వేలకు పైగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాం. మరో 60 వేల వరకు ప్యాకెట్లు నిల్వ ఉన్నాయి. వేసవిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం.

వైద్యులు, మందుల కొరత ఉందా..?

డీఎంహెచ్‌వో: గతంలో పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాం. జిల్లా కేంద్రంలో మందుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడంతో వేగంగా మందులను పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 22 మంది, యూపీహెచ్‌సీల్లో 44 మంది వైద్యులకు 18 మంది పనిచేస్తున్నారు. కొరత ఉన్నచోట కొత్తగా వైద్యులను నియమించాల ని ప్రభుత్వానికి నివేదించాం. ఆయుష్‌ వైద్యు ల సేవలను వినియోగించుకుంటూ పీహెచ్‌సీల్లో సేవలందిస్తున్నాం.

వేసవిలో ఎలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది..?

డీఎంహెచ్‌వో: వేసవిలో విరేచనాలు, డయేరియా, కామెర్లు, తట్టు, గవద బిల్లల సమస్యలు తలెత్తుతాయి. ఎండలు ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలు, వేపుడు, జంక్‌ఫుడ్‌ మాంసాహా రం, మద్యం ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదముంది. పిల్లలను శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. వదులుగా ఉండే కాటన్‌ బట్టలు వేసుకోవాలి.

వైద్య సిబ్బంది, ప్రజలకు మీరిచ్చే సలహాలు..?

డీహెంహెచ్‌వో: జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జిల్లా నుంచి పీహెచ్‌సీ వరకు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాం. ఎప్పటికప్పుడు కలెక్టర్‌తో కలిసి వైద్య సిబ్బందితో సమీక్షలు జరుపుతున్నాం. పంచాయతీశాఖ, ఈజీఎస్‌, పోలీస్‌శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించాం. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాం. ప్రజలు శుభకార్యాలు, విహార యాత్రలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి.

జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లో)

ప్రాంతం బుధ గురు

తిర్యాణి 44.9 44.8

ఎల్కపల్లి 44.8 44.8

కెరమెరి 44.8 45.0

వంకులం 44.7 44.8

సిర్పూర్‌(టి) 44.6 44.4

ఆసిఫాబాద్‌ 44.6 44.9

లోనవెల్లి 44.5 44.1

మండుటెండల్లో జాగ్రత్తలే రక్ష1
1/1

మండుటెండల్లో జాగ్రత్తలే రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement