సొంత భవనాల్లోకి సమాఖ్యలు
ఉపాధిహామీ నిధులతో నిర్మాణాలకు శ్రీకారం రూ.30 లక్షలతో మండలానికో గోదాం, రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనాలు మార్చిలోగా మొదటి విడత నిర్మాణాలు పూర్తి మహిళా సంఘాల అభివృద్ధికి మరో ముందడుగు
వాంకిడి: మహిళా సమాఖ్యల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండల, గ్రామ సంఘాలకు ఉపాధిహామీ నిధుల నుంచి సొంత భవనాలు నిర్మించేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు మహిళా సంఘాలకు గ్రామాల్లో సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండల, గ్రామీణ స్థాయిల్లో స్థలాల గుర్తింపునకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు రావడంతో ప్రక్రియ కొనసాగుతోంది. మహిళలు స్వశక్తితో ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం బ్యాంకు రూణాలు అందజేస్తోంది. అయితే సంఘాల సమావేశాలు నిర్వహించేందుకు చోటు లేకపోవడంతో ఇళ్లు, చెట్లు, ఆరుబయట ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఊరూరా సొంత భవనాలు నిర్మించేందుకు నిధులను మంజూరు చేయనుంది. మండల సమాఖ్య భవనాలతోపాటు ప్రతీ మండలానికి ఉత్పత్తులు స్టోర్ చేసుకునేందుకు గోదాంలు, వర్క్ షెడ్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రతీ భవనానికి రూ.10 లక్షలు
మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు ఉపాధిహామీ నిధులు వాడుకునే అవకాశం కల్పించారు. ప్రతీ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించనున్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 15 మండల సమాఖ్యలు ఉండగా.. 386 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. 11 మండలాల సమాఖ్యలకు కార్యాలయ భవనాలు ఉండగా.. పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి, లింగాపూర్, రెబ్బెన మండలాల్లో నూతన కార్యాలయాలు నిర్మించనున్నారు. అలాగే ప్రతీ మండలానికి రూ.30 లక్షలతో గోదాంలు, రూ.10 లక్షలతో వర్క్ షెడ్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం మండలాల వారీగా గ్రామాల్లో స్థలాలు పరిశీలిస్తున్నారు. ఊరి బయట స్థలాలు కాకుండా గ్రామ మహిళా సంఘాలకు భవనం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. స్థలాల గుర్తింపు పూర్తయిన తర్వాత సభ్యులతో తీర్మానం చేసి పంచాయతీకి సమర్పిస్తారు. గ్రామసభ తీర్మానంతో పూర్తి వివరాలను ఎంపీడీవోకు సమర్పిస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి తనిఖీ చేసి ప్రతిపాదనలు రూపొందిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా భవనాలు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో 50 నుంచి 100 భవనాలు నిర్మించనున్నారు.


