అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
ఆసిఫాబాద్‌అర్బన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో ఎస్పీ నితిక పంత్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి బుధవారం అట్రాసిటీ కేసులపై అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025లో 32 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 29 కేసుల్లో బాధితులకు రూ.20లక్షలు పరిహారం మంజూరయ్యాయన్నారు. ప్రతీ నెల 30న గ్రామాల్లో తహసీల్దార్, ఎస్సై, ఇతర అధికారులతో పౌరహక్కుల దినోత్సవం నిర్వహిస్తూ చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కుల వివక్ష లేకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్పీ నితిక పంత్ మాట్లాడుతూ అట్రా సిటి కేసులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు కేసుల విచారణ వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అశోక్, సత్యజిత్ మండల్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, మానిటరింగ్ కమిటీ సభ్యులు కేశవ్‌రావు, అశోక్, సిడాం అర్జు, గోపాల్, గణేశ్, గంగుబాయి పాల్గొన్నారు.


