ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కెరమెరి(ఆసిఫాబాద్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని కొఠారి గ్రామంలో బుధవారం జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి పర్యటించారు. అనేక మంది ఇప్పటికీ కనీసం గుంతలు కూడా తవ్వకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని, దశలవారీగా బిల్లులు అందుతాయని తెలిపారు. అనంతరం నర్సరీని తనిఖీ చేశారు. ఎండల నేపథ్యంలో మొక్కల రక్షణకు గ్రీన్‌నెట్ ఉపయోగించాలని సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించారు. మోడల్ ఇందిర మ్మ ఇంటిని పరిశీలించారు. ఝరి, కొఠారి గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్ దత్తుప్రసాద్, డీటీ సంతోష్‌కుమార్, నాయకులు మునీర్ అహ్మద్, కోవ ఇందిర తదితరులు ఉన్నారు.


