అర్హులందరికీ యువ వికాసంతో లబ్ధి
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హత గల వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగులు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనందిస్తున్నామని తెలిపారు. అర్హులు ఏప్రిల్ 14లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.50వేలలోపు రుణం తీసుకుంటే వందశాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షలలోపు వారికి 90శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షలలలోపు వారికి 70శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టరేట్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దినపత్రికలు, ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అధికారులు పాల్గొన్నారు.


