ఎర్రబంగారం
ఏడిపిస్తున్న
● ఒక్కో రైతుకు రూ.లక్షల్లో నష్టం ● మహారాష్ట్రకు పంట తరలింపు ● భారమవుతున్న రవాణా ఖర్చు ● పెట్టుబడి కూడా రాని పరిస్థితి ● మార్కెట్ లేక తప్పని తిప్పలు
నాగ్‌పూర్ మార్కెట్‌లో
చింతలమానెపల్లి మండల మిర్చి రైతులు
ఇతడు చింతలమానెపల్లి మండలం రణవెల్లికి చెందిన జాటోత్ సోమేశ్. తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేయగా 180 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేక పంటను నాగపూర్ మార్కెట్‌కు తీసుకువెళ్లాడు. ఇందుకు రవాణా ఖర్చులు క్వింటాల్‌కు సుమారు రూ.1,400 అయ్యాయి. మార్కెట్‌లో రూ.11వేల ధర పలికింది. రవాణా ఖర్చులు పోను ఈ రైతుకు క్వింటాల్‌కు రూ.9,500 మాత్రమే మిగిలింది. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోనూ ఇతనికి మిగిలింది నష్టమే. 20 ఎకరాలకు ఇతడు పెట్టిన పెట్టుబడి రూ.30లక్షలు కాగా, పంట అమ్మగా ఖర్చులు పోనూ రూ.22లక్షలే మిగిలాయి. దీంతో ఈ రైతు రూ.8లక్షలు నష్టపోయాడు.
ఇది ఈ ఒక్క రైతు పరిస్థితి కాదు. జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు చేసిన రైతులందరిది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగు చేస్తారు. ఇతర వాణిజ్య పంటలకు ప్రోత్సాహం లేకున్నా రైతులు ప్రయోగాత్మకంగా, సొంతంగా ఏర్పాటు చేసుకున్న నీటి వనరుల సహాయంతో పసుపు, పండ్ల తోటలు, కూరగాయలు, మిర్చి, పొద్దుతిరుగుడు, వేరుశనగ సాగు చేస్తున్నారు. కానీ.. జిల్లాలో మార్కెట్ యార్డులు లేక ‘మద్దతు’ దక్కక మిర్చి రైతులు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
చింతలమానెపల్లి: జిల్లాలో ఏటా మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. రెండేళ్ల క్రితం కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 2,100 ఎకరాల్లో సా గు కాగా, ఈసారి ఒక్క కౌటాల మండలంలోనే సు మారు 2వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. పత్తి, సోయాతో పోలిస్తే మిర్చి లాభసాటిగా ఉంటుందని రైతులు భావించారు. చింతలమానెపల్లి మండలంలో సుమారు 800 ఎకరాలు, బెజ్జూర్‌లో 400, పెంచికల్‌పేట్‌లో 600, దహెగాంలో 800 ఎకరాలు, సిర్పూర్ మండలంలో సుమారు 2వేల ఎకరాల్లో మిర్చి సాగవుతున్నట్లు అంచనా. కాగజ్‌నగర్ డివిజన్‌తో పోలిస్తే ఆసిఫాబాద్ డివిజన్‌లో సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది.
మహారాష్ట్రకు తరలింపు
జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో మిర్చి సాగు చేసిన రైతులు పంటను విక్రయించుకునేందుకు మ హారాష్ట్రకు తరలించాల్సి వస్తోంది. స్థానికంగా పండించే పంట నాణ్యతతో ఉన్నా స్థానికంగా మార్కెట్ వసతి లేక మహారాష్ట్రలోని నాగ్‌పూర్, ఇంగన్‌గాట్ తదితర ప్రాంతాలకు పంటను తరలిస్తున్నారు. అక్కడ దళారులు ఇచ్చిన ధరకే విక్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అక్కడినుంచే రిటైల్ వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసి ఇక్కడి మార్కెట్‌లో వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
ఖర్చులు పెరుగుతున్నాయి
జిల్లాలో మిర్చి పంటను అమ్ముదామంటే మార్కెట్‌యార్డు లేదు. నాగ్‌పూర్ లేదా వరంగల్‌కు తరలించాలి. ఇందుకు రవాణా ఖర్చులు క్వింటాల్‌కు రూ.1,200 అవుతున్నాయి. దీంతో మేము నష్టపోవాల్సి వస్తోంది.
– మోర్లె గణపతి, బూరెపల్లి, చింతలమానెపల్లి
ప్రభుత్వం పట్టించుకోవాలి
మిర్చి రైతులకు మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆదిశగా చ ర్యలు తీసుకోలేదు. దీంతో నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మద్దతు ధర ఇవ్వకుండా రైతు ప్రభుత్వమని ఎందుకు చెప్పుకొంటున్నారు.
– తెలిగె మల్లేశ్, ఒడ్డుగూడెం, దహెగాం
రైతుకు దక్కని ‘మద్దతు’
మూడేళ్ల క్రితం కౌటాల మండలం తాటిపల్లి గ్రామ రైతులు మిర్చి సాగు చేసి లాభాలు గడించారు. అప్పుడు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించి రైతులను ప్రోత్సహించారు. వీరిని ఆదర్శంగా తీసుకో వాలని సూచించారు. మిర్చి పంటకు వస్తు న్న ఆదరణతో కౌటాలతో పాటు జిల్లా వ్యా ప్తంగా సాగు పెరిగింది. అయినా రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడింది. గతేడాది క్వింటాల్‌కు రూ.20వేలు ఉండగా.. ఒక్కో రైతుకు నాణ్యమైన పంటకు రూ.15వేల నుంచి రూ.18వేల ధర లభించింది. ప్రస్తుతం రూ.12వేలు పలుకుతోంది. నాగ్‌పూర్, వరంగల్ మార్కెట్‌లలో రూ.8వేల నుంచి రూ.11వేలు మాత్రమే ఉంది. మిర్చి సాగుకు ఎకరాకు రూ.లక్షా 20వేల వరకు ఖర్చవుతుండగా కనిష్టంగా 9 క్వింటాళ్లు.. గరిష్టంగా 12క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈలెక్కన రైతుకు పెట్టుబడి కూడా దక్కడం లేదు.
ఎర్రబంగారం
ఎర్రబంగారం
ఎర్రబంగారం


