● కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అధికారులు, సిబ్బందిని అడ్డుకున్న ఆశవర్కర్లు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట బుధవారం తెలంగాణ ఆశ వర్కర్స్ యూని యన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశవర్కర్లు చేపట్టిన ధర్నా, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 9 గంటలకే ఆశవర్కర్లు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్రధాన దారికి రెండు వైపులా బైఠాయించారు. అధికారులు, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, ఆశవర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఏఎస్పీ చిత్తరంజన్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి సిబ్బందిని లోపలికి పంపించారు. అదనపు కలెక్టర్ కలెక్టరేట్‌కు కార్యాలయానికి వస్తుండగా ఆశలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. ఎండలోనూ మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సీఐటీయూ నాయకులు రాజేందర్, శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే మరో 106 రోజుల పోరాటం తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిపి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఆశలకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వడంతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రమాదబీమా కింద రూ.50 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు కృష్ణమాచారి, నాయకులు నగేశ్, స్వరూప, పద్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం