మర్యాద తప్పుతున్న పోలీసు! | - | Sakshi
Sakshi News home page

మర్యాద తప్పుతున్న పోలీసు!

Jul 1 2024 2:12 AM | Updated on Jul 1 2024 11:22 AM

మర్యాద తప్పుతున్న పోలీసు!

మర్యాద తప్పుతున్న పోలీసు!

సాక్షి, ఆసిఫాబాద్‌: ‘స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించండి. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి..’ ఇటీవల పలు మండలాల్లోని పోలీస్‌ స్టేషన్లను సందర్శించిన సమయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందితో మాట్లాడిన మాటలివి. కానీ పోలీసులు వాటిని పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. మండలాల్లో ఎస్సైల ప్రవర్తన జిల్లా పోలీసు అధికారుల ప్రకటనలకు భిన్నంగా ఉంటోంది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని ఓ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై పద్ధతి స్టేషన్‌కు వెళ్లే ప్రజలను ఇబ్బంది పెడుతోంది. మర్యాద తప్పి ఆయన వ్యవహరించే తీరు వారిని భయాందోళనకు గురిచేస్తోంది.

బూతు పురాణం వినాల్సిందే..
కౌటాల సర్కిల్‌లోని ఓ సరిహద్దు మండలంలోని ఈ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే బాధితులు, ఫిర్యాదుదారులు ఎవరైనా సరే సదరు ఎస్సై బూతు పురాణం వినడానికి సిద్ధం కావాల్సిందే. రాజకీయ నాయకుల అండదండల కోసం ఎంతకై నా తెగిస్తారనే ప్రచారం జరుగుతోంది. సదరు ఎస్సై పని చేస్తున్న మండలంలోని ఓ గ్రామంలో జరిగిన అక్రమ ఇసుక వివాదంలో నిర్లక్ష్యంతో వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ కారణంగానే ఘటన వివాదాస్పదంగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సరిహద్దు మండలంలో నకిలీ విత్తనాల సరఫరాను అరికట్టడంలో సదరు ఎస్సై విఫలం కాగా.. టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో మాత్రం భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. మరోవైపు మండలం నుంచి మహారాష్ట్రకు భారీ టిప్పర్లలో నిబంధనలకు విరుద్ధంగా కంకర తరలింపుపై ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అక్రమార్కులకు ఎస్సై అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సర్కిల్‌ పరిధిలోని పోలీసు అధికారులు సదరు కంకర కాంట్రాక్టర్‌ ఇచ్చిన విందుకు కూడా హాజరైనట్లు సమాచారం.

భూ వివాదాల్లో జోక్యం
గ్రామాల్లోని భూవివాదాల్లో ఎస్సై తలదూర్చి ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంపై బాధితులు మండిపడుతున్నారు. న్యాయం చేయాల్సిన చోట ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ గ్రామంలోని భూవ్యవహారంలో వారసుల మధ్య వివాదం ఉండగా.. వారిలో ఒక సోదరుడు మరణించాడు. అతడి భార్య కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ తీసుకువచ్చింది. కోర్టు ఆదేశాలను సైతం సదరు ఎస్సై తోసిపుచ్చారు. 

‘రూ.10వేలు పడేస్తే లాయర్లు వంద కాగితాలు రాసి ఇస్తారు’ అంటూ వ్యాఖ్యానించడంతో బాధితులు అవాక్కయ్యారు. ఇదే వివాదంలో సదరు వితంతు మహిళతో ఫోన్‌లో దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. భూమిలోకి వెళ్తే కేసు పెడతానని సదరు మహిళను బెదిరించి గతంలో బతికినట్లే కూలి పని చేసుకోవాలని తీర్పునివ్వడం ఆయన తీరును తెలియజేస్తోంది. కోర్టు ధృవీకరణను తోసిపడేయడంతోపాటు దురుసుగా వ్యవహరించడంపై భయభ్రాంతులకు గురైన బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

గతంలోనూ వివాదాలే..
సదరు ఎస్సై గతంలో మంచిర్యాల జిల్లాలోని ఓ మండలంలో పని చేసిన సమయంలోనూ వివాదా స్పదంగా వ్యవహరించారు. ఓ భూవివాదంలో జోక్యం చేసుకోవడంతోపాటు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం, నకిలీ విత్తనాలు, పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నా యి. వీటిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. విచారణ అనంతరం ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement