గతంలో కన్నా పెరిగిన 30,208 మంది
‘డ్రాఫ్ట్’లో పురుష ఓటర్లే అధికం
వచ్చేనెల 10వరకు మరో అవకాశం, అదేనెల 30న తుది జాబితా
వచ్చేనెల 30న తుదిజాబితా
పట్టభద్రుల ఓటర్లు
మంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్ – ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితా బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్ర ఓటర్లు 1,54,193 మంది ఉన్నారు. ఓటర్ల నమోదుకు సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీ కాగా, ఈనెల 6న గడువు ముగిసింది. అయితే, ఇంకా మిగిలిపోయిన వారు డిసెంబర్ 10వరకు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు.
1.70 లక్షల మంది దరఖాస్తు
గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఓటర్లుగా 2023 అక్టోబర్ 31 వరకు డిగ్రీ లేదా తత్సమాన డిప్లమా పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్దారించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలో 1.10లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 60 వేల మంది కలిపి 1.70లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన అనంతరం 1,54,193 మందిని అర్హులుగా నిర్ధారించి ముసాయిదా జాబితాలో చేర్చారు.
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల
ఉమ్మడి జిల్లాకు సంబంధించి బుధవారం పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా విడుదలైంది. ఈ సందర్భంగా 1,54,193 మంది ఓటర్లు నమోదు కాగా, ఇందులో ఖమ్మం జిల్లా నుంచి 1,01,671 మంది, భద్రాద్రి జిల్లా నుంచి 52,522 మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఖమ్మం అర్బన్ మండలంలో 31,312 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక భద్రాద్రి జిల్లా పాల్వంచలో అత్యధికంగా 6,429 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.
పురుష ఓటర్లే అధికం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి జిల్లా ఓటర్లలో పురుషులే అధికంగా నమోదయ్యారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే 250 పోలింగ్ స్టేషన్లకు గాను పురుష ఓటర్లు 89,309 మంది, మహిళా ఓటర్లు 64,881 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంటుండగా, ఈ జాబితాలో మాత్రం 58శాతం పురుషులే ఉండడం గమనార్హం. దీంతో పట్టభద్ర ఓటర్లుగా నమోదులో మహిళలు అంతగా ఆసక్తి చూపలేదనే చర్చ జరుగుతోంది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికల్లో 1,23,985 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 30,208 మంది ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. తుది జాబితా నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఉమ్మడి జిల్లా ముసాయిదా జాబితా విడుదల
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే ఏడాది మార్చి తర్వాత జరగనుంది. ఈమేరకు ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేయగా, వచ్చేనెల 12వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించనున్నారు. అంతేకాక వచ్చేనెల 10వ తేదీ వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా దరఖాస్తులు కూడా పరిశీలించాక వచ్చేనెల 30న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.


